
డీఏ జీఓను తక్షణం సవరించాలి : యూటీఎఫ్
ధర్మవరం అర్బన్: డీఏ జారీపై ప్రభుత్వం ఇచ్చిన అసంబద్ధ జీఓను తక్షణమే సవరించాలని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శెట్టిపి జయచంద్రారెడ్డి, జిల్లా కార్యదర్శి రామకృష్ణనాయక్ డిమాండ్ చేశారు. పట్టణంలోని యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో మంగళవారం వారు మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక శాఖ జీఓ నెంబర్ 60 ఉద్యోగులకు, జీఓ నెంబర్ 61 పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు ఒక డీఏను మంజూరు చేస్తూ సోమవారం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. అధికారులతో ముఖ్యమంత్రి, మంత్రులు చర్చించే సందర్భంలో కనీస ప్రస్తావనకు రాని అంశాలను ఈ జీఓలలో ప్రస్తావించడాన్ని ఖండిస్తున్నామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా డీఏ అరియర్స్‌ను ఉద్యోగ విరమణ అనంతరం చెల్లిస్తామని చెప్పడం సమంజసం కాదన్నారు. సీపీఎస్ ఉద్యోగుల అరియర్స్‌కు సంబంధించి జీఓలలో ఎక్కడ ప్రస్తావన లేదన్నారు. ఉద్యోగ విరమణ చేసిన వారికి 2027–28 ఆర్థిక సంవత్సరంలో 12 వాయిదాలలో బకాయిలు చెల్లిస్తామని చెప్పడం సరికాదన్నారు. నాలుగు పెండింగ్ డీఏలను ఇవ్వాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఒక డీఏ మాత్రమే విడుదల చేసి చెల్లింపులో కొర్రీలు వేయడం సరికాదన్నారు. తక్షణమే జీఓ 60, 61ను సవరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో యూటీఎఫ్ ధర్మవరం పట్టణ శాఖ అధ్యక్షుడు జింకా హరికృష్ణ, ప్రధాన కార్యదర్శి సాయిగణేష్, నాయకులు లక్ష్మయ్య, హెచ్ రామాంజనేయులు, నాగిరెడ్డి, ఆంజనేయులు, అమర్‌నారాయణరెడ్డి, రాంప్రసాద్, బిల్లే రామాంజనేయులు, వెంకటకిషోర్ తదితరులు పాల్గొన్నారు.