బస్సులన్నీ కర్నూలు వైపే!
ధర్మవరం: ప్రధాని నరేంద్రమోదీ గురువారం కర్నూలు జిల్లా పర్యటన నేపథ్యంలో ఆర్టీసీ బస్సులను అధికారులు ఇష్టారాజ్యంగా తరలించారు. జన సమీకరణలో భాగంగా బుధవారమే ఆర్టీసీ బస్సులను తరలించడంతో ప్రయాణికులు, విద్యార్థులు, మహిళలు, ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు. జిల్లాలోని ఆర్టీసీ బస్టాండులన్నీ బస్సులు లేక బోసిపోయాయి. బస్సులు వస్తాయని ప్రయాణికులు గంటల కొద్ది వేచి చూశారు. చివరకు విషయం తెలుసుకుని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ముందస్తుగా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. జిల్లాలోని అన్ని డిపోల నుంచి 250కు పైగా బస్సులను అధికారులు తరలించగా, ఇందులో ఒక్క ధర్మవరం డిపోకు చెందిన 51 బస్సులు ఉండడం గమనార్హం.
● కొత్తచెరువు: పుట్టపర్తి మండలం జగరాజుపల్లి సమీపంలోని ఏపీ మోడల్ స్కూల్, మంగళకర విద్యా సంస్థలో చదువుకుంటున్న కొత్తచెరువు మండలానికి చెందిన విద్యార్థినులు దాదాపు వంద మంది బుధవారం బస్సులు లేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఈ నెల 16న కర్నూలులో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బస్సులను ముందు రోజే తరలించడంతో ఈ సమస్య నెలకొంది. దీంతో పలువురు విద్యార్థులు రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
బస్సులన్నీ కర్నూలు వైపే!
బస్సులన్నీ కర్నూలు వైపే!


