ప్రకృతి వ్యవసాయం భేష్
పుట్టపర్తి అర్బన్: తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు గడించే ప్రకృతి వ్యవసాయం అద్భుతంగా ఉందని జర్మనీ ప్రతినిధుల బృందం కితాబునిచ్చింది. బుధవారం చీఫ్ సెక్రటరీ రాజశేఖర్, కలెక్టర్ శ్యాం ప్రసాద్, ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మానాయక్, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో కలిసి జర్మన్ అంబాసిడర్ డాక్టర్ ఫిలిప్ అక్రెమన్, హైదరాబాద్ కౌన్సిల్ జనరల్ అమిత దేశాయ్, సీనియర్ సెక్టార్ స్పెషలిస్ట్ సంగీత అగర్వాల్, ప్రకృతి వ్యవసాయం సీనియర్ అడ్వైజర్‌లు మురళీధర్, వరప్రసాద్, వైఎస్సార్ కడప, పులివెందులకు చెందిన అధికారులు పుట్టపర్తి మండలం పెడపల్లి, పెద్దతండాల్లో పర్యటించారు. ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు, మహిళా సంఘాల ప్రతినిధులతో ముచ్చటించారు. పెడపల్లి పెద్ద తండాకు చెందిన రైతు ఆంజనేయులు నాయక్ పొలంలో జీవామృతం, ఘనామృతం తయారీ విధానాన్ని జర్మనీ బృందం సభ్యులు అడిగా తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయంతో రైతు విజయలక్ష్మి బాయి సాగు చేసిన వేరుశనగ, జొన్న, సజ్జ, చిక్కుడు, ఆముదం, మొక్కజొన్న, ఆకు కూరలు, పెసర, అలసంద పంటలను పరిశీలించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం షాజహాన్ పండిస్తున్న వరి మడిని పరిశీలించారు. ముఖ్యంగా చిరుధాన్యాల సాగుతో లాభాలు బాగున్నాయని తండా వాసులు వివరించారు. అనంతరం జర్మనీ బృందం సభ్యులు, అధికారులతో కలిసి చిరుధాన్యాలతో తయారు చేసిన భోజనాన్ని ఆరగించారు. ప్రకృతి వ్యవసాయంతో పండించిన పంటలు, నవధాన్యాల సాగు, జీవామృతం, ఘనామృతం, సీడ్ ట్రీట్‌మెంట్, భూమికి వేసే ఎరువులు, రోగాలు వచ్చే ముందు, వచ్చిన తర్వాత వినియోగించే మందుల పిచికారీ విధానాలను ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు మేనేజర్ లక్ష్మానాయక్ జర్మనీ బృందం సభ్యులకు క్షుణ్ణంగా వివరించారు.
కార్యక్రమంలో పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, జిల్లా వ్యవసాయాధికారి రాము నాయక్, జిల్లా ఉద్యానశాఖ అధికారి చంద్రశేఖర్, ఏపీఎంఐపీ పీడీ సుదర్శన్, పశుసంవర్ధకశాఖ అధికారి శుభదాస్, తహసీల్దార్ కల్యాణ చక్రవర్తి, ఏడీఏలు కృష్ణమీనన్, స్వయంప్రభ, ఏఓలు, ఇతర వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
● జర్మనీ ప్రతినిధుల బృందం కితాబు


