టీచర్ల కొరత నివారించండి : ఎస్టీయూ
పుట్టపర్తి: డీఎస్సీ–2025 ద్వారా ఎంపికై న నూతన ఉపాధ్యాయులను పట్టణ ప్రాంతాల్లో మాత్రమే నియమించారని, ఫలితంగా గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో టీచర్ల కొరత తీవ్రమైందని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు గజ్జల హరిప్రసాదరెడ్డి అన్నారు. వెంటనే గ్రామీణ ప్రాంత పాఠశాలల్లో టీచర్ల కొరత నివారణకు సర్దుబాటు చర్యలు చేపట్టాలని డీఈఓ కృష్ణప్పను కోరారు. ఈ మేరకు బుధవారం డీఈఓను కలిసి వినతి పత్రం సమర్పించి, మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా అనేక పాఠశాలలో టీచర్ల కొరత తీవ్రంగా ఉందన్నారు. కొత్త టీచర్ల నియామకం తర్వాత కూడా ఈ సమస్య అలాగే కొనసాగడం విచారకరమన్నారు. మున్సిపల్ పాఠశాలల్లో సెకండ్ గ్రేడ్, లాంగ్యేజ్ పండిట్ల కొరత ఉందన్నారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్ల కొరత ఉందన్నారు. గత సంవత్సరం 10వ తరగతి బోధించే ఉపాధ్యాయులు నూరు రోజుల కార్యక్రమంలో భాగంగా సెలవు దినాల్లోనూ పనిచేయాల్సి వచ్చిందన్నారు. వారికి లీప్ యాప్‌లో సీసీఎల్ ఇన్సర్ట్ చేసి వినియోగించుకునేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 10వ తరగతి మూల్యాంకనం విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు టీఏ, డీఏ జమ చేయాలన్నారు.కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యుడు వెంకటేశ్వర్లు, కొత్తచెరువు మండల శాఖ అధ్యక్షుడు శివయ్య, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.


