 
															యానిమేటర్ చేతివాటంపై విచారణ
రొళ్ల: మండలంలోని జీబీహళ్లి గ్రామంలో యానిమేటర్ తిమ్మరాజు చేతివాటంపై మంగళవారం మధ్యాహ్నం డీపీఎ అరుణకుమారి విచారణ చేపట్టారు. తనకు నగదు అవసరముందని, పొదుపు సంఘాల సభ్యుల పేరుమీద బ్యాంకుల ద్వారా మంజూరైన రుణం తీసుకుని తానే చెల్లిస్తానంటూ నమ్మబలికి రెండేళ్లుగా చెల్లించకుండా తిమ్మరాజు చేసిన మోసంపై పలువురు సభ్యులు రాతపూర్వకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో డీపీఎం క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. తిమ్మరాజుతో పాటు బాధిత జేకే మారుతి, ధనలక్ష్మి పొదుపు సంఘాల సభ్యులతో సమావేశమయ్యారు. తమ పేరుపై రెండేళ్ల క్రితం మంజూరైన రూ.4 లక్షల రుణాన్ని తిమ్మరాజు తీసుకున్నాడని సభ్యులు ఆధారాలతో సహా చూపించారు. రెండేళ్లుగా అసలు, వడ్డీ చెల్లించకుండా ముఖం చాటేశాడని ఆవేదన వ్యక్తం చేశారు. తీసుకున్న మొత్తానికి ఇప్పటి వరకూ అసలు, వడ్డీ కలిపి సుమారు రూ.6.5 లక్షలకు పైగా అవుతుందని యానిమేటర్‌పై చర్యలు తీసుకుని రుణం మొత్తాన్ని చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరారు. అయితే తాను రూ.2.5 లక్షలు మాత్రమే చెల్లిస్తానంటూ తిమ్మరాజు తెలపడంతో, అలా కుదరదని మొత్తం చెల్లించాల్సిందేనంటూ సభ్యులు మండిపడ్డారు. బ్యాంక్ స్టేట్‌మెంట్ తీసుకుని పరిశీలించిన అనంతరం మొత్తం డబ్బు కట్టించేందుకు చర్యలు తీసుకుంటామని డీపీఎం హామీనిచ్చారు. వారం రోజుల్లోపు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని యానిమేటర్ తిమ్మరాజును హెచ్చరించారు. కార్యక్రమంలో వెలుగు అధికారులు, పొదుపు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
