అన్నదాతకు ‘నై’రుతి దెబ్బ !
పుట్టపర్తి అర్బన్: నైరుతి రుతు పవనాలు ఈసారి పెద్దగా ప్రభావం చూపలేదు. అనుకున్నంతగా వర్షాలు లేకపోవడంతో అన్నదాతలు పంటల సాగుకు మొగ్గు చూపలేదు. ఆగస్టు నెల తప్ప మిగతా నాలుగు నెలలు లోటు వర్షపాతం నమోదు కావడంతో కర్షకులకు ఎదురుదెబ్బ తగిలింది.
వేరుశనగ రైతులకు నష్టాలు
జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది లోటు వర్షపాతాన్నే మిగిల్చింది. జూన్ జులై మాసాల్లో ఎన్నడూ లేనంతగా అతి తక్కువ వర్షాలు కురిశాయి. దీంతో రైతులు కొనుగోలు చేసిన వేరుశనగ విత్తనాలు సైతం మార్కెట్‌లో అమ్ముకున్నారు. వర్షాలు కురుస్తాయన్నధైర్యంతో సాగు చేసిన పంటలు ఇప్పుడిప్పుడే చేతి కొస్తున్నాయి. ముందుగా వేరుశనగ సాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను చూశారు. వేరుశనగ పంటకు ఎకరాకు సుమారు రూ. 50 వేలు ఖర్చు చేయగా రూ.20 వేలు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట సాగుతో పాటు ఎరువులు, కూలీలు, మందుల పిచికారీకి విపరీతంగా ఖర్చు చేయగా.. పంట చేతికొచ్చే సమయానికి గిట్టుబాటు ధర లేక పోవడంతో లబోదిబోమంటున్నారు. పరిహారమైనా ఇవ్వక పోతారా అని ఆశపడిన రైతులకు కూటమి ప్రభుత్వం మొండి చేయి చూపింది. వర్షాలు పడక ఖరీఫ్‌లో ఎక్కువ మంది రైతులు నష్టపోవడంతో రబీలో పంటలు సాగు చేయాలా వద్దా అని అన్నదాతలు సంశయంలో ఉన్నారు.
ఖరీఫ్‌లో 75 వేల హెక్టార్లలో సాగు
జిల్లాలో సాధారణంగా ఖరీఫ్‌లో 2,69,022 హెక్టార్లలో పంటలు సాగు చేస్తారు. ఇందులో అత్యధికంగా వేరుశనగ 1,51,824 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా కేవలం 37 వేల హెక్టార్లలో సాగు చేశారు. కంది 28,925 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉండగా కేవలం 12,586 హెక్టార్లలో సాగు చేశారు. మొక్కజొన్న సుమారు 11 వేల హెక్టార్లు, వరి 2500 హెక్టార్లు, పత్తి 3390 హెక్టార్లు, ఆముదము 2300 హెక్టార్లు సాగు చేశారు. వీటితో పాటు రాగి, సజ్జ, జొన్న, ఉలవ, పొద్దు తిరుగుడు తదితర పంటలు సాగు చేశారు. రబీ సీజన్‌లో సుమారు 63 వేల హెక్టార్లు పంట సాగులోకి రావాల్సి ఉంది. నేటికీ సరైన వర్షాలు లేకపోవడంతో కనీసం ప్రత్యామ్నాయ పంటల సాగు చేయడం కూడా కష్టంగా ఉందని రైతులు వాపోతున్నారు.
రైతులను పట్టించుకోని కూటమి సర్కార్
జిల్లాలో ప్రత్యామ్నాయ పంటలైన ఉలవ, జొన్న, పెసర, అలసంద పంటలను రైతులు అత్యధికంగా సాగు చేస్తారు. ప్రతి ఏటా 64 వేల హెక్టార్లలో ప్రత్యామ్నాయ పంటలు వేస్తారు. అయితే ఈసారి ప్రత్యామ్నాయ విత్తనాలను కూడా ప్రభుత్వం పంపిణీ చేయకపోవడంతో ఆ భూములన్నీ బీడుగా మారే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయ విత్తనాలు అందిస్తే కనీసం జీవాల మేతకు వాడతారు. ఈసారి విత్తనాలు ఇవ్వక పోవడంతో జీవాలకు మేత కూడా కరువవుతుందని రైతులు వాపోతున్నారు. వెంటనే విత్తనాలు పంపిణీ చేయాలని కోరుతున్నారు.
గతమెంతో ఘనం
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్ రైతులకు అన్ని విధాలా అండగా నిలిచారు. ఖరీఫ్‌లో విత్తనాలు, ప్రత్యామ్నాయ విత్తనాలు, రబీలో శనగ, వేరుశనగ విత్తనకాయలతో పాటు ఎరువులు కూడా పంపిణీ చేసేవారు. సాగు చేసే సమయానికి రైతు భరోసా, పంట నష్టపోతే అదే సీజన్ ముగిసే సమయానికి పంట నష్టపరిహారంతో పాటు పంటలకు గిట్టు బాటు ధరలు దక్కేవని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. నైరుతి రుతు పవనాల కాలం ముగియనుండగా ఈశాన్య రుతు పవనాలు ప్రవేశించనున్నాయి. కనీసం ఈ సమయంలోనైనా వర్షాలు కురిస్తే పంటల సాగుకు అనుకూలంగా ఉంటుంది లేదంటే మళ్లీ వలసలు తప్పేలాలేవని అంటున్నారు.
ఆగస్టు తప్ప నాలుగు నెలలూ లోటు వర్షపాతమే
తుపానులు రాకుంటే రబీకీ గడ్డు కాలమే
ఖరీఫ్‌లో సాగైంది కేవలం 75 వేల హెక్టార్లు
ప్రత్యామ్నాయం లేక అన్నదాత ఆందోళన
అన్నదాతకు ‘నై’రుతి దెబ్బ !


