
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
గోరంట్ల: బ్యాంకుల నుంచి నగదు డ్రా చేసి తీసుకువెళ్లే వారిని టార్గెట్ చేసి దోచుకునే ఆరుగురు సభ్యులు గల అంతర్రాష్ట్ర ముఠాను గోరంట్ల పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.11.30 లక్షల నగదును స్వాధీనం చేసుకోవడంతో పాటు చోరీలకు ఉపయోగించిన కారును సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సోమవారం గోరంట్ల పోలీసు స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నర్సింగప్ప, గోరంట్ల సీఐ శేఖర్ వెల్లడించారు.
ఆరుగురు నిందితులు...
నాలుగు రాష్ట్రాల్లో చోరీలు
గోరంట్ల మండలం కొండాపురం గ్రామానికి చెందిన రైతు భుజంగరావు ఈనెల 3వ తేదీన స్థానిక స్టేట్‌బ్యాంక్‌లో రూ.3.80 లక్షలు డ్రా చేసుకొని ద్విచక్రవాహనంలోని సైడ్‌బ్యాగులో పెట్టుకొని ఇంటికి వెళ్లే క్రమంలో గోరంట్లలోని ఓ వస్త్ర దుకాణం వద్ద ఆగాడు. దుకాణంలోకి వెళ్లి తిరిగి వచ్చి చూసుకునే సరికి ద్విచక్రవాహనం సైడు బ్యాగులో ఉంచిన నగదు కనిపించలేదు. దీంతో రైతు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. గోరంట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 14వ తేదీ (ఆదివారం) సాయంత్రం పాలసముద్రం సమీపంలోని ‘కియో’ హోటల్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న మధ్యప్రదేశ్ రాష్ట్రం రాజ్‌ఘడ్‌లోని కడియాశాంతి గ్రామానికి చెందిన దీపభాయితోపాటు పరిత సిసోడియా, ప్రదీప్ సిసోడియా, రేఖాబాయి, మమత, మాలభాయిలను అదుపులోనికి తీసుకుని ప్రశ్నించారు. విచారణలో రైతు భుజంగరావుకు చెందిన రూ.3.80 లక్షల నగదును తామే చోరీ చేసినట్లు వారు ఒప్పుకున్నారు. అంతేకాకుండా ఆగస్టు 27వ తేదీ నుంచి రాష్ట్రంలోని పులివెందుల, జమ్మలమడుగు, కర్ణాటక రాష్ట్రంలోని మధుగిరి, తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్, జనగామ, ఒడిశా రాష్ట్రంలోని బరంపూర్‌లో చోరీలు చేసినట్లు ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు రైతు భుజంగరావు వద్ద చోరీ చేసిన రూ.3.80 లక్షలతో పాటు వివిధ కేసులకు సంబంధించి రూ.7.50 లక్షలు మొత్తంగా రూ.11.30 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చోరీలకు ఉపయోగించిన కారును సైతం సీజ్ చేశారు. సోమవారం నిందితులను పెనుకొండ కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ నర్సింగప్ప తెలిపారు. చోరీ కేసులను చాకచక్యంగా ఛేదించిన సీఐ శేఖర్, ఎస్‌ఐ రామచంద్రతో పాటు సిబ్బందిని డీఎస్పీ నరసింగప్ప ప్రత్యేకంగా అభినందించారు.
రూ.11.30 లక్షల నగదు స్వాధీనం,
కారు సీజ్