
అవినీతికి రె‘వెన్యూ’
● పుట్టపర్తి మండలం కొట్లపల్లి రెవెన్యూ పొలం సర్వే నంబరు 254–3లోని 4.68 ఎకరాలకు 1965లోనే ప్రభుత్వం హరిజన సుబ్బన్నకు డీ పట్టా ఇచ్చింది. ఆయన మరణాంతరం ఆయన కుమారుడు గంగాద్రి సాగులో ఉన్నాడు. అయితే ఇటీవల ఆ భూమిని అధికారులు బెంగళూరుకు వలస వెళ్లిన ముగ్గురి పేరిట ఆన్‌లైన్‌లో ఎక్కించారు. వన్–బీ, పాసు పుస్తకాలు కూడా ఇచ్చారు. దీంతో బాధితుడు తహసీల్దార్ కార్యాలయానికి రాగా.. అధికారుల నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.
● పుట్టపర్తి మండలం కప్పలబండ రెవెన్యూ పొలం సర్వే నంబరు 179–6లోని 25 సెంట్లను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో ఒకరికి ఇచ్చారు. ప్రస్తుతం అదే నంబరుపై మరొకరి పట్టా ఇచ్చారు. దీంతో ఇరు వర్గాల మధ్య భూ తగాదా మొదలైంది. ఇరువర్గాల వారు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు. ఇరువర్గాలు వేర్వేరు రాజకీయ పార్టీలకు చెందిన వారు కావడంతో అధికార పార్టీ సానుభూతి పరులకు ఆ భూమి దక్కింది.
సాక్షి, పుట్టపర్తి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పేదల భూములకు రక్షణ లేకుండా పోయింది. అధికారం అండతో కొందరు నేతలు ఇతర పార్టీల సానుభూతి పరుల భూముల రికార్డులను తారుమారు చేస్తున్నారు. ఏళ్లుగా సాగులో ఉన్నా... రాజకీయ కుట్రలతో రికార్డుల నుంచి పేర్లు తొలగించి.. తమకు అనుకూలమైన వారి పేర్లు చేరుస్తున్నారు. తాము చెప్పినట్లు వినకపోతే బదిలీ తప్పదని బెదిరిస్తుండటంతో కూటమి నేతలు చెప్పిన వాటికంతా అధికారులు తలూపుతున్నారు.
‘పరిష్కార వేదిక’కు బాధితులు
ఏళ్లుగా సాగులో ఉన్నప్పటికీ రికార్డుల్లో మరొకరి పేరు చూపుతుండటంతో ప్రభుత్వం నుంచి అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలు మరొకరి చెందుతున్నాయి. దీంతో బాధితులు తహసీల్దార్ కార్యాలయాలను సంప్రదిస్తే.. ఎమ్మెల్యే కార్యాలయాన్ని సంప్రదించాలని సూచిస్తున్నారు. ఆ తర్వాత సర్వే చేస్తామని మాట దాట వేసి.. పట్టించుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే బాధితులంతా ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు తరలివస్తున్నారు. న్యాయం చేయండయ్యా అంటూ కలెక్టర్‌ను వేడుకుంటున్నారు. కానీ వారి అర్జీలన్నీ మళ్లీ తహసీల్దార్ కార్యాలయాలకే చేరుతుండగా... సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. మరికొందరు బాధితులు తమ భూమిని ఇతరులు ఆక్రమించుకున్నారని పోలీస్ స్టేషన్లు మెట్లు ఎక్కుతున్నారు. అయితే సివిల్ పంచాయితీతో తమకు సంబంధం లేదని పోలీసులు తేల్చిచెబుతున్నారు.
భూములకు రక్షణ కరువు
ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను కూటమి పార్టీల నాయకులు కబ్జా చేస్తున్నారు. రెవెన్యూ అధికారులనే పావులుగా వాడుకుంటూ.. భూదందాలు చేస్తున్నారు. ఈక్రమంలోనే డీ–పట్టా భూములకు రక్షణ లేకుండా పోయింది. 40 ఏళ్లుగా సాగులో ఉన్నా.. రికార్డుల్లో పేర్లు మార్చి పంచాయితీలు చేస్తున్నారు. చివరకు సరిహద్దులో దేశానికి కాపలాకాసే సైనికుల భూములు కాజేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూములను లాగేసుకుంటున్నారు.
అక్కడే ఎక్కువగా..
భూమి విలువ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే భూ తగాదాలు పెరుగుతున్నాయి. పుట్టపర్తి, కొత్తచెరువు, చిలమత్తూరు సోమందేపల్లి, పెనుకొండ, గోరంట్ల మండలాల నుంచి ప్రతి వారం భూ సమస్యలతో బాధితులు కలెక్టరేట్‌కు వస్తున్నారు. పదే పదే ఫిర్యాదు ఇచ్చినా... ఫలితం లేదని వాపోతున్నారు. పైగా ఫిర్యాదును పరిశీలించిన అధికారులు.. రాజకీయ నాయకుల వద్దకు వెళ్లాలని సూచిస్తున్నారని వాపోతున్నారు.
కలెక్టర్ ఆదేశాలు బేఖాతరు
పుట్టపర్తి మండలం పెడపల్లిలో ప్రభుత్వ భూమిలో ఓ వ్యక్తి భవనం నిర్మించారు. స్థానికులు కలెక్టర్ చేతన్‌కు ఫిర్యాదు చేయగా.. స్పందించిన ఆయన కూల్చేయాలని ఆదేశాలిచ్చారు. అయితే జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి ఈ అంశంలో జోక్యం చేసుకున్నారు. ఫిర్యాదు చేసిన వారెవరో తన వద్దకు వచ్చేలా చూడాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ భవనం కూల్చరాదని అధికారులకు హుకుం జారీ చేసినట్లు సమాచారం. దీంతో ఆ భవనం కూల్చేందుకు అధికారులెవరూ సాహసం చేయడంలేదు. పైగా మాజీ మంత్రి చర్యలతో ఫిర్యాదుదారులూ భయపడ్డారు.
మండల రెవెన్యూ కార్యాలయాల్లో అవినీతి బాగోతం
ప్రతి మండలంలోనూ
వెలుగు చూస్తున్న భూ తగాదాలు
‘ప్రజా సమస్యల పరిష్కారవేదిక’ను
ఆశ్రయిస్తున్న బాధితులు
కూటమి నేతల ఒత్తిళ్లతో
అధికారుల తప్పిదాలు
కొత్తచెరువు, పుట్టపర్తి, గోరంట్ల, చిలమత్తూరు మండలాల్లో అధికం
పెడపల్లి రెవెన్యూ పొలం సర్వే నంబరు 665–6లోని 1.36 ఎకరాలను 40 ఏళ్ల క్రితం చంద్రనాయక్‌కు ఇచ్చారు. ఇటీవల రెవెన్యూ రికార్డుల్లో ఈ భూమి యజమానికిగా మరొకరి పేరు చేర్చారు. సాగులో ఉన్నప్పటికీ.. రికార్డుల పరంగా వేరొకరి వస్తుండటంతో బాధితుడు రెవెన్యూ అధికారులను సంప్రదించాడు. సాగుకు అడ్డం వస్తే.. పోలీస్ స్టేషన్‌కు వెళ్లు.. రెవెన్యూ రికార్డుల్లో అవకతవకలతో ఏం కాదులే ఓ అధికారి రైతుకు చెప్పినట్లు తెలిసింది.