డీలా పడ్డ అంగన్‌వాడీలు | - | Sakshi
Sakshi News home page

డీలా పడ్డ అంగన్‌వాడీలు

Sep 3 2025 4:27 AM | Updated on Sep 3 2025 4:27 AM

డీలా పడ్డ అంగన్‌వాడీలు

డీలా పడ్డ అంగన్‌వాడీలు

పుట్టపర్తి అర్బన్‌: అంగన్‌వాడీల డిమాండ్లపై ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో సానుకూలత లభించలేదు. కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, ధరలకు అనుగుణంగా కూరగాయల బిల్లులు పెంచాలని, వివిధ రకాల యాప్‌లతో చేసిన పనినే మళ్లీ మళ్లీ చేసే విధానం నుంచి విముక్తి కల్పించి ఒకే యాప్‌ ప్రవేశపెట్టాలని, మినీ అంగన్‌వాడీలను మెయిన్‌ అంగన్‌వాడీ సెంటర్లుగా మార్పు చేయాలని తదితర డిమాండ్లతో ఆందోళనలు చేస్తున్నారు. ధర్నాలు–ఆందోళనలు చేసిన రోజులకు ప్రభుత్వం వేతనాల్లో కోత విధిస్తున్నా వెనక్కు తగ్గకుండా డిమాండ్ల సాధన కోసం పోరాడుతున్నారు.

పనులు బారెడు.. వేతనం మూరెడు..

చిన్నారులకు ఆట పాటలతో పూర్వప్రాథమిక విద్య నేర్పి, గర్భిణులు, బాలింతలకు యాప్‌ ద్వారా ఫొటోలు తీసి పౌష్టికాహారం అందజేయడం, ఆరి ఆరోగ్య విషయాలు వైద్య సిబ్బందికి తెలియజేయడం, సర్వేలతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సమాచారం యాప్‌లలో నమోదు చేయడం, వంటి ఎన్నో కార్యక్రమాలను అంగన్‌వాడీ వర్కర్లు చేస్తున్నారు. అయినా మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాల వర్కర్లకు రూ.11,500, మినీ అంగన్‌వాడీ సెంటర్ల వర్కర్లకు రూ.7,500 చెల్లిస్తున్నారు. ఇక కేంద్రాలకు వచ్చే చిన్నారులకు, లబ్ధిదారులకు భోజనం వండిపెట్టి పాత్రలను, కేంద్రాన్ని శుభ్రం చేసే ఆయాలకు రూ.7,500 ఇస్తున్నారు. ఇది ఏమాత్రమూ చాలడం లేదని అంగన్‌వాడీలు చెబుతున్నారు. దీంతో పాటు కేంద్రాలకు అవసరమైన కూరగాయలు, ఆకుకూరలు, గ్యాస్‌, తదితరాలకు బిల్లులు నెలల తరబడి విడుదల చేయకపోవడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి దాపురించిందంటున్నారు.

ఫోన్లు పనిచేయకున్నా తప్పని చీవాట్లు

2జీ సెల్‌ఫోన్లలో ఐసీడీఎస్‌ యాప్‌లు సరిగా పనిచేయడం లేదు. అంగన్‌వాడీ సేవలకు సంబంధించిన సమాచారం ఆన్‌లైన్‌లో సకాలంలో పంపకపోయినా, నెట్‌వర్క్‌ కారణంగా సెల్‌ఫోన్లు పనిచేయకపోయినా వర్కర్లకు అధికారుల నుంచి చీవాట్లు తప్పడం లేదు. లక్ష్యం చేరుకోలేదంటూ పలువురికి షోకాజ్‌ నోటీసులు సైతం జారీ చేస్తున్నారు. 5జీ సామర్థ్యంతో కూడిన సెల్‌ఫోన్లు ఇవ్వాలని, ఒకే యాప్‌ అమలు చేయాలని ఇటీవల అంగన్‌వాడీలు పాత సెల్‌ఫోన్లు వెనక్కు ఇచ్చేశారు. అయితే ప్రభుత్వం కొత్తవి ఇవ్వకుండా... పాతవే మళ్లీ అంటగట్టి వివరాలు నమోదు చేయాలంటూ సిబ్బందిపై ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. నెట్‌వర్క్‌–సిగ్నల్స్‌ సమస్యతో యాప్‌లు సరిగా పనిచేయక సిబ్బంది సతమతమవుతూనే ఉన్నారు. మరోవైపు లబ్ధిదారుల ఫొటో క్యాప్చర్‌ కాకపోతే సరుకులు ఇవ్వలేని పరిస్థితి. దీంతో తరచూ లబ్ధిదారులతోనూ ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వం ఇటీవల అంగన్‌వాడీల సమస్యలపై చర్చలకు పిలిచినా పూర్తిస్థాయిలో పరిష్కారాలు కాలేదు. వేతనం పెంపుపైన, యాప్‌ల భారం తగ్గింపుపైన, ధరలకు అనుగుణంగా బిల్లుల పెంపుపైన స్పష్టత ఇవ్వలేదు. దీంతో అంగన్‌వాడీలు మరోమారు డీలా పడాల్సి వచ్చింది.

జిల్లా గణాంకాలు

మెయిన్‌ అంగన్‌వాడీ కేంద్రాలు 2,207

మినీ అంగన్‌వాడీలు 617

అంగన్‌వాడీ వర్కర్లు 2,884

లబ్ధిదారులు 1,07,082

(గర్భిణులు, బాలింతలు, చిన్నారులు)

కూటమి ప్రభుత్వ తీరుపై అసంతృప్తి

కనీస వేతనం అమలుపై స్పందన లేదు

పాత ఫోన్లతోనే ఆన్‌లైన్‌ పనులకు హుకుం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement