
అప్పు చెల్లించలేదని దాడి
చెన్నేకొత్తపల్లి: అప్పుతీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించకపోవడంతో రుణదాత బండరాయితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన మంగళవారం మండల పరిధిలోని కనుముక్కల గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కనుముక్కల గ్రామానికి చెందిన ఓబుల్‌రెడ్డి వద్ద అదే గ్రామానికి చెందిన ఆంజనేయులు ఐదేళ్ల క్రితం రూ. 33 వేల అప్పుగా తీసుకున్నాడు. ప్రతి ఏటా వడ్డీ చెల్లించేవాడన్నారు. అయితే ఈ ఏడాది ఆంజనేయులు అప్పునకు వడ్డీ చెల్లించలేక పోయాడు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం గ్రామ సమీపంలో ఆంజనేయులు గొర్రెలు మేపుతుండగా...రుణదాత ఓబుల్‌రెడ్డి అక్కడికి వెళ్లి అప్పు వడ్డీతో సహా చెల్లించాలని డిమాండ్ చేశాడు. దీంతో వారి మధ్య మాటామాట పెరిగింది. తీవ్ర ఆవేశానికి లోనైన ఓబుల్‌రెడ్డి అక్కడే ఉన్న ఓ బండరాయితో దాడి చేశాడు. దీంతో ఆంజనేయులు కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే బాధితుడు ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. అనంతరం చెన్నేకొత్తపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా... పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.