
మీకోసం ప్రశ్నిస్తే మాపై కేసులా?
పుట్టపర్తి టౌన్: ‘‘మీకు అన్యాయం జరిగిందని మీరు చెబితే మేము వార్తలు రాశాం. మీకు అండగా నిలిచాం. అలాంటి మాకు అండగా నిలవాల్సింది పోయి అక్రమ కేసులు పెడతారా’’ అంటూ జర్నలిస్టులు ప్రశ్నించారు. డీఎస్పీ పదోన్నతుల్లో జరిగిన అక్రమాలపై ‘సాక్షి’ కథనం ప్రచురిస్తే..తట్టుకోలేని ప్రభుత్వ పెద్దలు సోమవారం రాత్రి పోలీసులతో ‘సాక్షి’ విజయవాడ కార్యాలయంపై దాడి చేయించడంతో పాటు పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించారు. ఈ చర్యలను నిరసిస్తూ మంగళవారం జిల్లాలో జర్నలిస్టులు ఎక్కడికక్కడ పోలీసులకు వినతి పత్రాలు సమర్పించారు. ‘సాక్షి’ ఎడిటర్‌పై బనాయించిన అక్రమ కేసును వెంటనే ఎత్తి వేయాలని డిమాండ్ చేస్తూ పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పలువురు జర్నలిస్టులు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సాక్షి స్టాఫ్ రిపోర్టర్ దివిటి రాజేష్ మాట్లాడుతూ.. డీఎస్పీ పదోన్నతుల్లో అక్రమాలపై పోలీసులే సాక్ష్యాలతో సహా సాక్షి మీడియా ముందుకు వస్తే... వారు చెప్పిన అంశాలనే వార్తగా రాశామన్నారు. దీంతో పోలీసులు ‘సాక్షి’ కార్యాలయంపై దాడి చేసి ఎడిటర్ ధనంజయరెడ్డిపై తప్పుడు కేసులు బనాయించారన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా సర్కార్ చర్యలను ఖండించాలన్నారు. కార్యక్రమంలో రిపోర్టర్లు గంగిరెడ్డి, విజయశేఖర్‌రెడ్డి, సతీష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.
● సాక్షి ఎడిటర్‌పై పెట్టిన అక్రమ కేసు ఎత్తివేయాలని పెనుకొండలో జర్నలిస్టులు మల్లికార్జున, గోవింద్, జాకీర్‌హుస్సేన్, శ్రీనివాసులు తదితరులు డీఎస్పీ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. సాక్షి ఎడిటర్‌పై అక్రమ కేసును ఎత్తివేసి పత్రికా స్వేచ్ఛను కాపాడాలన్నారు.
ప్రభుత్వం తీరు మార్చుకోవాలి
నిజాలు నిర్భయంగా రాస్తున్న పాత్రికేయులపై అక్రమ కేసులతో కూటమి ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని ఏపీ జర్నలిస్టు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఆదినారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సాక్షి కార్యాలయంపై దాడులకు దిగడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
పోలీసులు ఆత్మపరిశీలన చేసుకోవాలి
సాక్షి కార్యాలయంపై దాడి,
ఎడిటర్‌పై కేసులు దుర్మార్గం
ముక్తకంఠంతో ఖండించిన జర్నలిస్టులు

మీకోసం ప్రశ్నిస్తే మాపై కేసులా?