అయ్యవార్ల యాప్‌సోపాలు | - | Sakshi
Sakshi News home page

అయ్యవార్ల యాప్‌సోపాలు

Aug 7 2025 10:38 AM | Updated on Aug 7 2025 10:38 AM

అయ్యవ

అయ్యవార్ల యాప్‌సోపాలు

విద్యార్థులకు చదువు చెప్పడం కన్నా, పాలనాపరమైన బాధ్యతలు, బోధనేతర విధుల భారంతో ఉపాధ్యాయులు సతమతమవుతున్నారు. యాప్స్‌, బోధనేతర కార్యక్రమాల పేరుతో టీచర్లను కట్టుబానిసల్లా ప్రభుత్వం మార్చేసిందని జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటిగ్రేటెడ్‌ యాప్‌ల భారం నుంచి ఉపాధ్యాయులను మినహాయించి వారిని విద్యాబోధనకే పరిమితం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.

పుట్టపర్తి: ఉపాధ్యాయులకు బోధనేతర పనులు కేటాయించబోమని, వారిని బోధనకు మాత్రమే పరిమితం చేస్తామంటూ ఎన్నికల సమయంలో స్పష్టమైన హామీనిచ్చిన కూటమి పెద్దలు... అధికారం చేపట్టిన తర్వాత ఆ హామీని తుంగలో తొక్కారు. విద్యార్థులకు నాణ్యమైన ప్రపంచ స్థాయి విద్యను అందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌ కూడా ఇచ్చిన హామీ బుట్టదాఖలైంది. యాప్‌ల పేరుతో బోధనేతర పనులను కేటాయించడంతో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయుల్లో అసహనం రేకెత్తుతోంది.

పైకి ఒక్కటే.. తెరిస్తే 36!

కూటమి ప్రభుత్వం ఏర్పడితే తమకు ఏదో మేలు జరుగుతుదనే ధోరణి గతంలో ఉపాధ్యాయ, ఉద్యోగుల్లో వ్యక్తమైంది. అయితే ఇందుకు విరుద్ధంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పని భారంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ముఖ్యంగా యాప్‌ల భారం, శిక్షణా తరగతులతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పాఠశాల ప్రారంభమైన నుంచి ముగిసే వరకూ యాప్‌లతో ఉపాధ్యాయులు కుస్తీ పడుతున్నారు. మొత్తం 36 రకాల అంశాలకు సమాధానం ఇవ్వాల్సి వస్తోందని చెబుతున్నారు. ఉదయం పాఠశాలకు రాగానే విద్యార్ధుల, ఉపాధ్యాయుల హాజరు నుంచి మధ్యాహ్న భోజన పథకం, విద్యార్థుల కిట్లు, హాజరు, చిక్కీలు, కోడిగుడ్లు ఎన్ని వచ్చాయి అనే సమాచారం అప్‌లోడ్‌ చేయాలి. ఉదాహరణకు మధ్యాహ్న భోజనం విషయం తీసుకుంటే ప్రతిరోజూ ఎంత సరుకు వచ్చింది?. ఎంత వినియోగించారు?. అందుకు ఎంత బిల్లు అవుతుంది?. గుడ్లు ఎన్ని అందాయి అనే అంశాలను రికార్డుల్లో పొందుపరచాల్సి ఉంటుంది. అలాగే ప్రతి తరగతిలో ఎంతమంది పిల్లలు హాజరయ్యారు అనే వివరాలను స్టూడెంట్స్‌ అటెండన్స్‌ యాప్‌లో నమోదు చేయాలి. ఇవి కాకుండా దీక్ష యాప్‌లో పిల్లలకు పాఠాలు ఎలా బోధిస్తున్నారు, వారికి పరీక్షల్లో వచ్చిన మార్కుల వంటి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. వీటిని భర్తీ చేసి అప్‌లోడ్‌ చేయడానికి చాలా సమయం పడుతుండడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ తీరుతో బడులు మూత పడే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తమవుతోంది.

పీ–4 విధానంతో మరింత అసహనం..

అట్టడుగున ఉన్న పేదల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పీ4 కార్యక్రమానికి ఉన్నత వర్గాల నుంచి విముఖత వ్యక్తం కావడంతో ఆ భారాన్ని ఉపాధ్యాయులపై బలవంతంగా రుద్దారు. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రవేశపెట్టిన ఈ విధానంలో ఆయా కుటుంబాలను దత్తత తీసుకోవాలంటూ ఉపాధ్యాయులపై ఒత్తిళ్లు తీవ్రమయ్యాయి. దీంతో ఉపాధ్యాయులు మరింత అసహనానికి లోనవుతున్నారు. ఎన్నికల సమయంలో ఉపాధ్యాయ, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. కొత్తగా పేద కుటుంబాలను దత్తతకు తీసుకోవాలని ఒత్తిడి చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ఉపాధ్యాయ సంఘాలు పోరుబాటకు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. ఇప్పటికే పలు ఉపాధ్యాయ సంఘాలు వ్యక్తిగతంగా ఆందోళన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాయి.

ప్రభుత్వ తీరుతో బోధనకు

దూరమవుతున్న ఉపాధ్యాయులు

యాప్‌ భారంతో కొండెక్కిన

విద్యార్థుల చదువు

పీ–4 దత్తత తీసుకోవాలంటూ

తీవ్ర ఒత్తిడి

చదువులకు దూరమవుతున్నారు

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌లో వివరాలను భర్తీ చేసి అప్‌లోడ్‌ చేయడానికి చాలా సమయం పడుతోంది. దీంతో బోధనపై దృష్టి పెట్టలేకపోతున్నాం. బోధనేతర పనుల నుంచి ఉపాధ్యాయులను తప్పించాలి. ప్రభుత్వ తీరుతో పేద విద్యార్థులు చదువులకు దూరమవుతున్నారు.

– శ్రీచందన, బుచ్చయ్యగారిపల్లి, బుక్కపట్నం మండలం

మినహాయింపునివ్వాలి

యాప్‌ల నుంచి ఉపాధ్యాయులకు మినహాయింపునివ్వాలి. ఆర్పీలను, ఇతర సిబ్బందికి ఈ విధులు అప్పగించాలి. రోజులో అధిక సమయం యాప్‌లో వివరాలు నమోదు చేయడానికే సరిపోతోంది. దీంతో బోధన కరువై విద్యార్థులు చదువులకు దూరమవుతారు. ఈ విధానానికి ప్రభుత్వం స్వస్తి పలకాలి.

– బడా హరిప్రసాదరెడ్డి, ఏపీటీఎఫ్‌(1938) జిల్లా అధ్యక్షుడు

అయ్యవార్ల యాప్‌సోపాలు 1
1/3

అయ్యవార్ల యాప్‌సోపాలు

అయ్యవార్ల యాప్‌సోపాలు 2
2/3

అయ్యవార్ల యాప్‌సోపాలు

అయ్యవార్ల యాప్‌సోపాలు 3
3/3

అయ్యవార్ల యాప్‌సోపాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement