
ఉద్యోగుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత
● జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ
అనంతపురం సిటీ: ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ అన్నారు. ఉమ్మడి జిల్లాలోని జిల్లా పరిషత్, అనుబంధ విభాగాల్లో వివిధ హోదాల్లో పని చేస్తూ అకాల మరణం పొందిన ఉద్యోగులకు సంబంధించిన వారసులు 13 మందికి జూనియర్ అసిసెంట్లుగా నియామక ఉత్తర్వులను జిల్లా పరిషత్ కార్యాలయంలోని తన చాంబర్‌లో బుధవారం ఆమె అందజేసి, మాట్లాడారు. విధి నిర్వహణలో క్రమశిక్షణ అలవర్చుకోవాలని కోరారు. కేటాయించిన విధులకు సంబంధించి సీనియర్ల సలహాలు తీసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికి శ్రీకాళహస్తిలోని కేంద్రంలో శిక్షణ అనంతరం విధుల్లో చేరాల్సి ఉంటుందని జెడ్పీ సీఈఓ శివశంకర్ తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య, ‘ఎ’ సెక్షన్ ఏఓ షబ్బీర్ నియాజ్, సీనియర్ అసిస్టెంట్లు అరుణకుమారి, మాధవి, జూనియర్ అసిస్టెంట్ జోషి ప్రణీత్, టైపిస్ట్ సుభాష్ పాల్గొన్నారు.
జాతీయ స్థాయి క్రీడలకు
నవోదయ విద్యార్థులు
లేపాక్షి: నవోదయ విద్యాలయ క్లస్టర్ స్థాయి క్రీడా పోటీల్లో లేపాక్షి నవోదయ విద్యార్థులు 20 మంది ప్రతిభ చాటి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారు. క్రీడలు ముగించుకుని బుధవారం ఉదయం విద్యాలయానికి చేరుకున్న విద్యార్థులను ప్రిన్సిపాల్ నాగరాజు, సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ.. జూలై 29 నుంచి 31వ తేదీ వరకు జరిగాయి నవోదయ విద్యాలయాల క్లస్టర్ స్థాయి పోటీలు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగాయన్నారు. కేరళలోని మల్లాపురం నవోదయలో జరిగిన జూడో అండర్–14 పోటీల్లో సింధూ, హర్షిక, లాస్య, అండర్–17లో యశస్విని, అండర్–19లో శ్రీవాణి ప్రతిభ చాటారన్నారు. వీరు భోపాల్‌లోని నవోదయ విద్యాలయలో జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో పాల్గొంటారన్నారు. అలాగే ఏలూరులో జరిగిన క్రికెట్ పోటీలలో అండర్–14 విభాగంలో దర్శిత్‌సాయి, అండర్–17లో హేమలత, వినూత, భువనేశ్వరి, ఫణిప్రకాష్ ప్రతిభ కనబరిచి, హర్యానాలోని కురుక్షేత్రం నవోదయలో జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో క్లస్టర్ జట్టు తరఫున ప్రాతినిథ్యం వహిస్తారని పేర్కొన్నారు. తెలంగాణలోని కరీంనగర్ నవోదయలో జరిగిన ఖోఖో అండర్–19 పోటీలలో సింహాద్రి ప్రతిభ కనబరిచి ఒడిశాలోని కటక్ నవోదయలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించాడన్నారు. తెలంగాణలోని రంగారెడ్డి నవోదయలో జరిగిన బాల్‌గేమ్స్ భవ్యశ్రీ విజేతగా నిలిచి, గుజరాత్‌లోని రాజ్‌కోట్ నవోదయలో జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రాతినిథ్యం వహిస్తోందన్నారు. గుంటూరు నవోదయలో జరిగిన యోగా పోటీల్లో చరణ్‌సాయి, నిధిక్ ప్రతిభ కనబరిచారని, వీరు గుంటూరు నవోదయలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారన్నారు. విజయనగరం నవోదయలో జరిగిన బాల్‌గేమ్స్ క్రీడల్లో జయదీపికా ప్రతిభ కనబరిచి బిహార్‌లోని పాట్నా నవోదయలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. కేరళలోని కాసర్‌ఘడ్ నవోదయలో జరిగిన బాస్కెట్‌బాల్ క్రీడల్లో జుతేష్ ప్రతిభ కనబరిచి మధ్యప్రదేశ్‌లోని గుణ నవోదయ విద్యాలయలో జరిగే జాతీయ స్థాయిలో పోటీల్లో ప్రాతినిథ్యం వహించే క్లస్టర్ జట్టు తరఫున పాల్గొననున్నాడని తెలిపారు. ప్రతిభ చాటిన విద్యార్థులను క్రీడా ఉపాధ్యాయులు వివేకానంద, వేదవతి, షేక్ ఆసీఫ్‌అలీ, సిబ్బంది అభినందించారు.

ఉద్యోగుల సంక్షేమానికి తొలి ప్రాధాన్యత