
‘పురం’లో భూమి.. చిలమత్తూరులో రిజిస్ట్రేషన్!
● రూ.కోటి విలువైన భూమిని టీడీపీ నేత మంగేష్‌కు రిజిస్ట్రేషన్
● రాత్రి ఏడు గంటల సమయంలో తతంగం
చిలమత్తూరు: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో బుధవారం సాయంత్రం పోలీసు బందోబస్తు నడుమ రాజ్ సుధీర్ అనే వ్యక్తి హిందూపురంలోని తన భూమిని టీడీపీ నేత మంగేష్‌కు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. హిందూపురం రెవెన్యూ గ్రామానికి చెందిన భూమిని అక్కడ కాకుండా చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పోలీసు బందోబస్తు మధ్య చేయడం అనుమానాలకు తావిచ్చింది. కాగా.. అత్యంత భద్రంగా ఉండాల్సిన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ డాక్యుమెంట్ గదిలో ప్రైవేటు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడం కలకలం రేపింది.
అసలు ఏం జరిగిందంటే..
రాజ్ సుధీర్ అనే వ్యక్తికి హిందూపురం రూరల్ అప్‌గ్రేడ్ స్టేషన్ పక్కన భూమి ఉండేది. ఈ భూమిని 2004లో ప్లాట్లుగా వేసిన రాజ్ సుధీర్ పలువురికి విక్రయించాడు. అయితే వారెవరికీ రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. తాజాగా మంగేష్‌కు అదే భూమిలోని కొంత భాగాన్ని కోటి రూపాయలకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అయితే హిందూపురంలో రిజిస్ట్రేషన్ పెట్టుకుంటే గతంలో భూములు కొన్నవారు వచ్చి అడ్డుకుంటారని భావించి చిలమత్తూరులో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అయితే ఈ విషయం తెలుసుకున్న రాజ్ సుధీర్ బాధితులు... చిలమత్తూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్దకు చేరుకుని తమను మోసం చేసిన రాజ్ సుధీర్‌ను పట్టుకున్నారు. టీడీపీ నేత మంగేష్ వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా...వారంతా ఎదురు తిరిగారు. దీంతో మంగేష్ అక్కడి నుండి జారుకున్నారు. అనంతరం బాధితులు రాజ్ సుధీర్‌ను స్థానిక పీఎస్‌లో అప్పజెప్పారు.
ఎస్‌ఐ నరేంద్ర ఓవరాక్షన్..
లేపాక్షి ఎస్‌ఐ నరేంద్ర చిలమత్తూరు పోలీస్ స్టేషన్‌లో ఓవర్ యాక్షన్ చేశారు. గొడవ గురించి ఆరా తీసేందుకు స్టేషన్‌లోకి వెళ్లగా... లోపలికి ఎవరు రమ్మన్నారంటూ విలేకరులపై దురుసుగా ప్రవర్తించారు. పోలీసులు సివిల్ వ్యవహారాల్లో తలదూర్చకూడదని చట్టం చెబుతుండగా... ఎస్‌ఐ నరేంద్ర మాత్రం.. ఇరువర్గాలను ఒప్పించి సెటిల్‌మెంట్ చేయాలని చూస్తున్నానని చెప్పడం గమనార్హం. అంతేకాకుండా ఎస్‌ఐ నరేంద్ర నింది తుల పక్షాన సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బందోబస్తు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

‘పురం’లో భూమి.. చిలమత్తూరులో రిజిస్ట్రేషన్!