అప్పులు తీర్చలేక చేనేత కార్మికుడి ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

అప్పులు తీర్చలేక చేనేత కార్మికుడి ఆత్మహత్య

Jul 23 2025 5:39 AM | Updated on Jul 23 2025 5:39 AM

అప్పు

అప్పులు తీర్చలేక చేనేత కార్మికుడి ఆత్మహత్య

ధర్మవరం అర్బన్‌: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీలో నివాసముంటున్న లక్ష్మీప్రసాద్‌(39)కు భార్య కుసుమ, ఓ కుమార్తె ఉన్నారు. చేనేత పనులతో కుటుంబాన్ని పోషించుకునేవాడు. కొన్నేళ్లుగా మద్యానికి బానిసైన లక్ష్మీప్రసాద్‌.. సక్రమంగా పనికి పోకుండా కుటుంబ పోషణకు ప్రైవేట్‌ వ్యక్తుల వద్ద అప్పులు చేశాడు. ఈ క్రమంలో అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనకు లోనైన ఆయన సోమవారం రాత్రి ఇంట్లో తాడుతో ఉరి చేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడురోజుల క్రితం ఆడబిడ్డకు అనారోగ్యంగా ఉండటంతో అనంతపురం వెళ్లిన భార్య కుసుమ మంగళవారం ఫోన్‌ చేసినా భర్త ఎంతసేపటికి లిఫ్ట్‌ చేయకపోవడంతో వెంటనే ఇంటి పక్కనున్న గురుమూర్తికి ఫోన్‌ చేసి తెలిపింది. దీంతో ఆయన వెళ్లి కిటికీలో నుంచి చూడగా ఉరికి విగతజీవిగా వేలాడుతున్న లక్ష్మీప్రసాద్‌ కనిపించాడు. విషయాన్ని తెలుసుకున్న కుసుమ వెంటనే తన మామ మస్తానప్పకు ఫోన్‌ చేయడంతో ఆయన ఇందిరమ్మ కాలనీలోని ఇంటికి వెళ్లి కుమారుడిని ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి తండ్రి మస్తానప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు రెండో పట్టణ సీఐ రెడ్డప్ప తెలిపారు.

హెడ్‌ పోస్టాఫీసులో డిజిటల్‌ సేవలు

హిందూపురం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ విజయకుమార్‌

హిందూపురం: పోస్టల్‌ నెట్‌వర్క్‌ని ఆధునీకరించి గ్రామీణ ప్రాంతాల్లోనూ డిజిటల్‌ సేవలు అందుబాటులో తీసుకురానున్నట్లు హిందూపురం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ యు.విజయకుమార్‌ తెలిపారు. మంగళవారం హిందూపురంలోని హెడ్‌పోస్టాఫీసులో అడ్వాన్స్‌డ్‌ పోస్టల్‌ టెక్నాలజీ–2.0 పోర్టల్‌ను ఆయన ప్రారంభించి, మాట్లాడారు. జిల్లాలోని మొత్తం పోస్టుఫీసులలో ఈ–సేవలను మంగళవారం నుంచి ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించుకుని పోస్టల్‌ సేవలను బలోపేతంతో చేయడం ద్వారా వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. పీఎం విశ్వకర్మ పథకం ద్వారా టూల్‌ కిట్లను కూడా పోస్టల్‌ ద్వారా దేశవ్యాప్తంగా పంపిణీ జరుగుతోందని వివరించారు. కార్యక్రమంలో పోస్టల్‌ అసిస్టెంట్‌ సూపరిటెండెంట్‌ మల్లికార్జున, శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్‌ విమల్‌ కుమార్‌, హెడ్‌ పోస్ట్‌మాస్టర్‌ మార్కండేయ, బ్యాంకు మేనేజర్‌ మురళి, పోస్టల్‌ సిబ్బంది పాల్గొన్నారు.

చికిత్స పొందుతూ

వృద్ధురాలి మృతి

గాండ్లపెంట: ఈ నెల 12న దుండగుడి దాడిలో గాయపడిన గాండ్లపెంట మండలం బనాన్‌చెరువుపల్లికి చెందిన ఎం.సరస్వతమ్మ(80) చికిత్సకు స్పందించక మంగళవారం మృతిచెందింది. ఈ మేరకు కుటుంబసభ్యులు తెలిపారు. కాగా, దాడి జరిగిన రోజు తలపై లోతైన గాయాలతో బాధపడుతున్న సరస్వతమ్మను కుటుంబసభ్యులు మెరుగైన వైద్యం కోసం అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేర్పించారు. తొలుత వృద్దురాలిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారని మృతురాలి అల్లుడు నరసింహారెడ్డి ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన ఎన్‌పీ కుంట ఎస్‌ఐ వలీబాషా.. కదిరి రూరల్‌ సీఐ నాగేంద్ర పర్యవేక్షణలో లోతైన విచారణ చేపట్టారు. ఆదే గ్రామానికి చెందిన సోమశేఖర్‌ అనే వ్యక్తి డబ్బు కోసం ఇంట్లో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై పట్టపగలే కట్టెతో తలపై దాడి చేసినట్లుగా నిర్ధారణ కావడంతో నిందితుడిని అరెస్ట్‌ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

బైక్‌పై విరిగిపడిన చెట్టు కొమ్మ.. వివాహిత మృతి

గుడిబండ: చెట్టు కొమ్మ విరిగి మీద పడడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వివాహిత మృతిచెందింది. పోలీసులు తెలిపిన మేరకు.. గుడిబండ మండలం మోరుబాగల్‌ గ్రామానికి చెందిన అరుణ (32), నాగప్ప దంపతులకు ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కరికెర గ్రామ సమీపంలో ఉన్న కేజీబీవీలో చదువుకుంటున్న కుమార్తెను చూసేందుకు సోమవారం సాయంత్రం దంపతులు ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. రోడ్డుకు ఇరువైపుల ఉన్న చింత చెట్లలోని ఓ చెట్టు కొమ్మ విరిగి ద్విచక్ర వాహనం మీద వెళుతున్న అరుణపై పడింది. తలకు బలమైన గాయం కావడంతో వెంటనే మడకశిరలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక అదేరోజు రాత్రి ఆమె మృతి చెందింది. ఘటనపై ఎస్‌ఐ రాజకుళ్లాయప్ప మంగళవారం కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

‘నాటుసారాపై నిఘా పెంచాలి’

ధర్మవరం అర్బన్‌: ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తూ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న నాటుసారా అడ్డుకట్టకు నిఘా పెంచాలని ప్రొహిబిషన్‌ ఎకై ్సజ్‌ డిప్యూటీ కమిషనర్‌ నాగమద్దయ్య, పుట్టపర్తి అసిస్టెంట్‌ ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ నరసింహులు సూచించారు. మంగళవారం ధర్మవరంలోని ఎకై ్సజ్‌ స్టేషన్‌ను ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించారు. అనంతరం ఎకై ్సజ్‌ సీఐ చంద్రమణి, ఎస్‌ఐ చాంద్‌బాషా, నాగరాజు, సిబ్బందితో మాట్లాడారు. నాటుసారా నిర్మూలనకు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించాలని సూచించారు. ప్రత్యేకంగా సభలు నిర్వహించి నాటుసారా నిర్మూలనపై ప్రజలను చైతన్య పరచాలన్నారు. నవోదయం కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలన్నారు.

అప్పులు తీర్చలేక చేనేత  కార్మికుడి ఆత్మహత్య 1
1/2

అప్పులు తీర్చలేక చేనేత కార్మికుడి ఆత్మహత్య

అప్పులు తీర్చలేక చేనేత  కార్మికుడి ఆత్మహత్య 2
2/2

అప్పులు తీర్చలేక చేనేత కార్మికుడి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement