
వైభవంగా మస్తానయ్య ఉరుసు
గుంతకల్లు: స్థానిక పాత గుంతకల్లు ప్రాంతంమస్తానయ్య నామస్మరణతో మార్మోగింది. హజరత్ మస్తాన్‌వలి ఉరుసు ఉత్సవాల్లో భాగంగా అత్యంత కీలకమైన షంషీర్ ఊరేగింపు మంగళవారం అంగరంగ వైభవంగా జరిగింది. వేకువజామున పుష్పాలతో అందంగా అలకంరించిన షంషీర్‌ను గుర్రంపై కొలువుదీర్చి మేళాతాళలతో దర్గా నుంచి గణాచారిరెడ్డి కులస్తుల ఇంటికి చేర్చారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం తిరిగి దర్గాకు తీసుకువచ్చారు. వేలాది భక్తులు తరలిరావడంతో పాత గుంతకల్లు జనసంద్రమైంది. ఊరేగింపులో ఎండ కొబ్బరి కాల్చేందుకు భక్తులు ఎగబడ్డారు. చక్కెర చదివింపులు, తులభారాలు, జంతుబలులతో మొక్కులు తీర్చుకున్నారు. బుధవారం జియారత్ కార్యక్రమంతో మస్తానయ్య ఉరుసు ఉత్సవాలు ముగిస్తాయని వక్ఫబోర్డు అధికారి రహీం, దర్గా కమిటీ సభ్యులు తెలిపారు.
వరి సాగులో జాగ్రత్తలు పాటించండి
● ఏరువాక కేంద్రం కో–ఆర్డినేటర్ డాక్టర్ రామసుబ్బయ్య
పుట్టపర్తి అర్బన్: నారు దశ నుంచి నాటే వరకూ జాగ్రత్తలు తీసుకుంటే వరికి రోగాలు ఆశించకుండా మంచి దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని ఏరువాక కో–ఆర్డినేటర్ డాక్టర్ కె.రామసుబ్బయ్య తెలిపారు. నారు మడి తీయడానికి వారం ముందు సెంటు నారు మడికి 160 గ్రాముల కార్బోపిరాన్ గుళికలు ఇసుకలో కలిపి పలుచగా నీరు ఉంచి చల్లాలన్నారు. నారు పీకిన తరువాత కొనలను తుంచి వేయాలన్నారు. నారు నాటే సమయంలో దుక్కిలోకి 200 కిలోల సింగిల్ సూపర్ ఫాస్పేట్, 25 కిలోల పొటాష్, 50 కిలోల యూరియా వేయాలన్నారు. నారు నాటే సమయంలో ప్రతి రెండు మీటర్లకు 20 సెంటీమీటర్ల కాలి బాటలు తీయాలన్నారు. దీంతో కలుపు సమస్య నివారించుకోవచ్చన్నారు. నాటిన మూడు రోజుల్లోపు ఎకరాకు బుటాక్లోరో ఒక లీటరును 20 కిలోల ఇసుకలో కలిపి చల్లాలన్నారు.

వైభవంగా మస్తానయ్య ఉరుసు