
ఎస్‌టీఎల్‌కు ‘ఎన్‌ఏబీఎల్’ గుర్తింపు
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక భూసార పరీక్షా ప్రయోగశాల (సాయిల్ టెస్టింగ్ ల్యాబొరేటరీ – ఎస్‌టీఎల్)కు కేంద్ర ప్రభుత్వం ఎస్‌ఏబీఎల్ (నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ కాలిబ్రేషన్ లాబొరేటరీస్) గుర్తింపు దక్కినట్లు వ్యవసాయశాఖ జేడీ ఉమామహేశ్వరమ్మ తెలిపారు. శుక్రవారం స్థానిక భూసార పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా ఎన్‌ఏబీఎల్ అక్రిడిటేషన్‌ను ఆమెకు ఎస్‌టీఎల్ ఏడీఏ రోజాపుష్పలత చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 ప్రయోగశాలలు ఉండగా అనంతపురంతో పాటు గుంటూరు, గొల్లపూడి, ఆముదాలవలసలోని ప్రయోగశాలలకు అక్రిడిటేషన్ దక్కిందన్నారు. ఈ గుర్తింపు 2028 వరకు ఉంటుందన్నారు. మట్టి సేకరణ, వాటి ద్వారా స్ఫూల, సూక్ష్మపోషకాల శాతం తెలుసుకునేందుకు 12 రకాల పరీక్షలు నిర్వహించడం, వాటిని అన్‌లైన్ చేయడం, వాటి ఫలితాలను సకాలంలో రైతులకు అందించడం, అలాగే లక్ష్యం మేరకు పరీక్షలు పూర్తి చేయడం, కేంద్రంలో మౌలిక సదుపాయాల కల్పన, మానవ వనరుల లభ్యత తదితర అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని ఎన్‌ఏబీఎల్ అధికారులు అక్రిడిటేషన్ ఇచ్చారని గుర్తు చేశారు. ఈ ఏడాది కూడా 25 వేల మట్టి పరీక్షలు చేయాలని లక్ష్యంతో ఉన్నామని, ఇప్పటికే 17,750 వరకు మట్టి శ్యాంపిల్స్ ప్రయోగశాలకు చేరగా.. పరీక్షలు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు.
ఈ ఏడాది 25 వేల మట్టి పరీక్షల లక్ష్యం