
బంగారు కుటుంబాలను గుర్తించండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో పెద్ద ఎత్తున గ్రామసభలను నిర్వహించి పీ4 కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించాలని కలెక్టర్ టీఎస్ చేతన్ అధికారులు, సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో పీ4 కార్యక్రమంపై బంగారు కుటుంబాలు, మార్గదర్శకులలు గుర్తింపు అంశంపై ఆర్డీఓలు, సచివాలయ సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి జిల్లాలోని అన్ని మండలాల్లో గ్రామ సభలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనల మేరకు బంగారు కుటుంబాలను, మార్గదర్శులను గుర్తించాలన్నారు. బంగారు కుటుంబాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని అర్హతలేనివి ఉన్నాయో గుర్తించి ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. బంగారు కుటుంబాల నమోదు, తొలగింపులను జాగ్రత్తగా చేయాలని సూచించారు. స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై మానిటరింగ్ చేయాలన్నారు.
ప్రభుత్వ పథకాల అమలులో..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సేవల విషయంలో ప్రజల్లో సంతృప్తి స్థాయిని పెంచేందుకు అధికారులు చోరవ తీసుకోవాలని కలెక్టర్ టీఎస్ చేతన్ ఆదేశించారు. గురువారం రాష్ట్ర రాజధాని అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ సేవలు అమలు తీరుపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి కలెక్టర్ చేతన్, జేసీ అభిషేక్ కుమార్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ చేతన్ మాట్లాడారు. ప్రభుత్వ పథకాల అమలులో ప్రజల నుంచి సానుకూలత పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓలు సువర్ణ, మహేష్, ఆనంద్‌కుమార్, ఎస్‌ఎస్‌వీ శర్మ, సీపీఓ విజయ్ కుమార్, పరిశ్రమలశాఖ జీఎం నాగరాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సూర్యనారాయణరెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ డీడీ శివరంగ ప్రసాద్, డీఎస్‌ఓ వంశీకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ టీఎస్ చేతన్