
‘నగదు బదిలీ పథకం ఉపసంహరించుకోవాలి’
పుట్టపర్తి టౌన్: హమాలీలకు శాపంగా మారే నగదు బదిలీ పథకం అమలు ఆలోచనను ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర పౌరసరఫరాల హమాలీల వర్కర్ల యూనియన్ అధ్యక్షుడు ఆర్.కృష్ణ డిమాండ్ చేశారు. స్థానిక సాయి ఆరామంలో బుధవారం సీఐటీయూ ఆధ్వర్యంలో జిల్లా హమాలీ యూనియన్ 5వ మహాసభలు జరిగాయి. అంతకు ముందు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుంచి సాయి ఆరామం వరకూ హమాలీలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కృష్ణ మాట్లాడారు. హమాలీలను 4వ తరగతి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు. ప్రతి నెలా 5న వేతనాలు చెల్లించాలని, సరుకు లోడింగ్.. అన్‌లోడింగ్ పనిని ఐదు రోజులకు కుదించాలని, హమాలీల ప్రాణాలకు ముప్పు తెచ్చే విధానాన్ని రద్దు చేసి 12 రోజుల పనిదినాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. హమాలీల కుటుంబాలకు అందాల్సిన పరిహారం త్వరగా అందించాలని కోరారు. అనంతరం జిల్లా హమాలీ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా నేలకోటప్ప, ఉపాధ్యక్షులుగా శ్రీరాములు, చుక్కలింగం, ప్రధాన కార్యదర్శిగా నాగరాజు, కోశాధికారిగా రామదాసుతో పాటు 11మంది సభ్యలను ఎన్నుకున్నారు.