
జవాన్ భూమిపై ‘పచ్చ’ పాగా
సాక్షి, పుట్టపర్తి
దేశ సరిహద్దులో పని చేసే ఆర్మీ ఉద్యోగుల భూములకు కూటమి ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది. జిల్లాలో రెండు నెలల వ్యవధిలోనే ముగ్గురు జవాన్లు తమ భూములు ఆక్రమణలకు గురయ్యాయంటూ కలెక్టరేట్‌ను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా కొత్తచెరువు మండలం మైలసముద్రానికి చెందిన జవాన్ తన భూమిని టీడీపీ నేతలు ఆక్రమించారని, దయచేసి తన భూమిని రక్షించాలని వేడేకుంటూ సెల్ఫీ వీడియో రూపొందించి విడుదల చేయడంతో టీడీపీ నేతల భూ ఆక్రమణల పర్వం మరోసారి చర్చనీయాంశమైంది.
ఏళ్లుగా కన్నేసి.. కూటమి రాగానే ఆకమ్రించి
కేశాపురం రెవెన్యూ పొలం సర్వే నంబరు 326–2ఏలోని 2.75 ఎకరాలకు ప్రభుత్వం 1983లోనే మైలసముద్రం గ్రామానికి చెందిన కేశాని పెద్దక్కకు పట్టా ఇచ్చింది. పక్కనే సర్వే నంబరు 326–2బీలోని 2.35 ఎకరాలను మైలసముద్రం గ్రామానికి చెందిన కిలారి జానకమ్మకు పట్టా ఇచ్చింది. అయితే కేశాని పెద్దక్క పొలంపై కన్నేసిన కిలారి జానకమ్మ కుటుంబీకులు ఏళ్లుగా ఆక్రమించాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువు దీరగానే మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అండదండలతో కిలారి జానకమ్మ భర్త కిలారి రామమోహన్, తనయుడు కిలారి గోవర్ధన్‌నాయుడు.. 2024 సెప్టెంబరులో 2.75 ఎకరాలను ఆక్రమించారు. పోలీసుల రక్షణతో (అప్పటి సీఐ ఇందిర) కేశాని పెద్దక్క పేరుతో ఉన్న భూమిలో టీడీపీకి చెందిన కిలారి రామమోహన్ తదితరులు మామిడి చెట్లు నాటారు. ఆ తర్వాత బోరుబావులు కూడా తవ్వించారు. దీంతో ఆ భూమి తమదని ఆక్రమణ సరికాదని కేశాని పెద్దక్క కుమారుడైన జవాన్ కేశాని రమేష్ టీడీపీ నాయకులను వేడుకున్నా వారు వినిపించుకోలేదు. పైగా పొలంలోకి వస్తే అంతుచూస్తామంటూ రమేష్ కుటుంబ సభ్యులను బెదిరించారు. దీంతో జవాన్ రమేష్ కుటుంబీకులు ఏడాది కాలంలో అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. అయినా ఫలితం లేకపోవడంతో... జవాన్ రమేష్ ఓ సెల్ఫీ వీడియో రూపొందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నాడు
మంత్రి లోకేశ్‌కు చెప్పినా ఫలితం లేదు..
మా భూమికి సంబంధించి 1983 నుంచి ఆధారాలున్నాయి. ఏడాది క్రితం వరకు పొలం మా ఆధీనంలోనే ఉంది. ప్రస్తుతం ఎకరా రూ.10 లక్షలపైనే పలుకుతోంది. దీంతో కొందరు టీడీపీ నేతలు మా పొలాన్ని ఆక్రమించారు. అధికారులకు మొరపెట్టినా ఎవరు పట్టించుకోలేదు. ఇటీవల మంత్రి నారా లోకేశ్ పుట్టపర్తికి వచ్చిన సమయంలో విమానాశ్రయం వద్ద వినతిపత్రం అందజేశా. అయినా స్పందనలేదు. అవతలి వ్యక్తులు టీడీపీకి చెందిన వారు... అగ్రవర్ణాల వారు కావడంతో అధికారుల మా మొర ఆలకించడం లేదు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నా. – రమేశ్, జవాన్
ఏడాది క్రితం దౌర్జన్యంగా
ఆక్రమించిన ‘తమ్ముళ్లు’
కొత్తచెరువు మండలం
మైలసముద్రంలో ఘటన
అసోంలో విధులు నిర్వర్తిస్తున్న
జవాన్ కేసాని రమేశ్

జవాన్ భూమిపై ‘పచ్చ’ పాగా