
కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యం
హిందూపురం టౌన్: కాలుష్య రహిత గ్రామాలే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అడుగులు వేస్తున్నాయని, ఇందుకోసం సౌరశక్తిని విరివిగా వినియోగించాలని భావిస్తున్నట్లు రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్, స్టాంప్స్ శాఖా మంత్రి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. బుధవారం పట్టణంలో శివారులోని జేవీస్ ప్యాలెస్ ఫంక్షన్ హాలులో కలెక్టర్ టీఎస్ చేతన్‌తో కలిసి ‘ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన సబ్సిడీ పథకం’పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ.. పీఎం సూర్య ఘర్ పథకంలో మహిళల భాగస్వామ్యం ఎంతో కీలకమన్నారు. కోటి ఇళ్ల మీద రూఫ్ టాప్ ఏర్పాటు చేసుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఏ గ్రామంలో అయితే వేగంగా అన్ని ఇళ్ల మీద రూఫ్ టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసుకుంటే ఆ గ్రామానికి రూ.కోటి అందిస్తామన్నారు. ఆ నిధులతో గ్రామాన్ని సమగ్రాభివృద్ధి చేసి మోడల్ గ్రామంగా తీర్చిదిద్దుతామన్నారు. సోలార్ రూఫ్ టాప్ ఏర్పాటుకు ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుందని, బ్యాంకులు రుణ సౌకర్యాన్ని అందిస్తాయని తెలిపారు. మహిళలు ఆర్థికంగా బాగుపడితే ఆ కుటుంబంతో పాటు ఆ ప్రాంతం కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. కలెక్టర్ చేతన్ మాట్లాడుతూ... ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల మీద రూఫ్ టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసుకుని పర్యావరణాన్ని కాపాడాలన్నారు. సోలార్ ఏర్పాటు వల్ల విద్యుత్తు బిల్లు తగ్గుతుందని తెలిపారు. అనంతరం ‘రాయితీతో మీ ఇంటిపై సోలార్ రూఫ్ టాప్ నిర్మించుకోండి, విద్యుత్తు బిల్లు తగ్గించుకోండి‘ బ్రోచర్‌ను విడుదల చేశారు. అలాగే ఇప్పటికే తమ ఇళ్ల మీద రూఫ్ టాప్ సోలార్‌ను ఏర్పాటు చేసుకున్న వారికి సన్మానం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్, పెనుకొండ ఆర్డీఓ ఆనంద్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున, డీఆర్‌డీఏ పీడీ నర్సయ్య, డీపీఓ సమత, ట్రాన్స్‌కో ఎస్‌ఈ సంపత్ కుమార్‌తో పాటు అధికారులు పాల్గొన్నారు.
జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి
అనగాని సత్యప్రసాద్
సుపరిపాలనలో సమస్యల ఏకరువు
హిందూపురం: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా బుధవారం జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ చిలమత్తూరు, లేపాక్షి మండలాల్లో పర్యటించగా జనం సమస్యలు ఏకరువు పెట్టారు. బుధవారం ఉదయం మంత్రి చిలమత్తూరు మండలం కోడూరు పంచాయతీ నల్లరాళ్లపల్లి గ్రామంలో ‘సుపరిపాలనలో తొలి అడుగు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. రెండు, మూడు ఇళ్లకు వెళ్లి ప్రజలతో సంక్షేమ పథకాలు అందాయా అంటూ ఆరా తీశారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు సమస్యలు ఏకరువు పెట్టారు. దీంతో ఏం చేయాలో తెలియని మంత్రి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని చెబుతూనే...‘వాటి గురించి చూడండయ్యా’ అంటూ అధికారులపై రుసరుసలాడుతూ ముందుకు సాగారు. అనంతరం లేపాక్షి మండలంలోనూ పర్యటించారు. రచ్చబండ వద్ద మహిళలతో గ్యాస్ సిలిండర్ వచ్చిందా.. అంటూ ఆరా తీయగా.. మహిళలు సిలిండర్లు అందలేదని సమాధానం ఇచ్చారు.