
నవీన్ నిశ్చల్, కొండూరు సస్పెన్షన్
● పార్టీ వ్యతిరేక కార్యకలాపాల నేపథ్యంలో
వైఎస్సార్ సీపీ నిర్ణయం
చిలమత్తూరు: పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న నేపథ్యంలో నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్‌రెడ్డిలను వైఎస్సార్ సీపీ సస్పెండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్తలుగా పనిచేసిన నవీన్ నిశ్చల్, కొండూరు వేణుగోపాల్‌రెడ్డి కొంతకాలంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు అందాయి. వాటిని విచారించిన క్రమశిక్షణ కమిటీ నివేదిక ఆధారంగా వారిద్దరినీ సస్పెండ్ చేస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
విద్యార్థి అనుమానాస్పద మృతి
● నెల్లూరు జీజీహెచ్ ఎదుట
స్నేహితుల ఆందోళన
నెల్లూరు సిటీ: ఓ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. శ్రీసత్యసాయి జిల్లా రామగిరి మండలానికి చెందిన జానా శ్రీకాంత్ (23) నెల్లూరు రూరల్ పరిధిలోని కాకుపల్లి గ్రామంలో ఉన్న సన్ ఫార్మసీ కళాశాలలో పీజీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రమణయ్య హాస్పిటల్లో ఫార్మసిస్ట్‌గా పార్ట్‌టైం పనిచేస్తున్నాడు. బుధవారం శ్రీకాంత్ హాస్పిటల్లో విధుల్లో ఉండగా కింద పడిపోయాడు. దీంతో సిబ్బంది ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. దీంతో మృతదేహాన్ని జీజీహెచ్‌కు తరలించారు. విషయం తెలుసుకున్న శ్రీకాంత్ స్నేహితులు జీజీహెచ్‌కు చేరుకుని ఆందోళనకు దిగారు. శ్రీకాంత్ ఆస్పత్రిలో విద్యుదాఘాతానికి గురై చనిపోయాడని ఆరోపించారు. అయితే సిబ్బంది మాత్రం హార్ట్ ఎటాక్ అని చెప్పడంపై అనుమానం వ్యక్తం చేశారు. వారి నిర్లక్ష్యంతోనే తమ స్నేహితుడు మృతిచెందాడని ఆగ్రహించారు. ఈ క్రమంలో జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సమాచారం అందుకున్న చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.