
అర్జీదారుడు సంతృప్తి చెందాలి
● పీజీఆర్‌ఎస్‌లో అందే
ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలి
● అధికారులకు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆదేశం
ప్రశాంతి నిలయం: ‘‘క్షేత్రస్థాయికి వెళ్లండి..సమస్యను స్వయంగా పరిశీలించండి.. అర్జీదారుడు సంతృప్తి చెందేలా పరిష్కారం చూపండి’’ అని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందే అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపి ప్రతి అర్జీకి పరిష్కారం చూపాలన్నారు. సోమవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఆయన పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై మొత్తం 281 అర్జీలు అందగా... వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. అనంతరం జేసీ అభిషేక్ కుమార్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...కలెక్టరేట్‌లో అర్జీ ఇస్తే తమ సమస్య పరిష్కారం అవుతుందని ప్రజలు ఎంతో నమ్మకంతో ఇక్కడిదాకా వచ్చి అర్జీ ఇస్తారని, అధికారులు బాధ్యత వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్‌ఓ విజయసారథి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రేపు మడకశిర చైర్మన్,
వైస్ చైర్మన్ ఎన్నిక
● ఎన్నికల అధికారిగా
పెనుకొండ ఆర్డీఓ ఆనందకుమార్
మడకశిర: స్థానిక నగర పంచాయతీ చైర్మన్, వైస్ చైర్మన్ స్థానాలకు బుధవారం ఎన్నిక జరుగనున్నట్లు మున్సిపల్ కమిషనర్ జగన్నాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. పెనుకొండ ఆర్డీఓ ఆనందకుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఉదయం 11 గంటలకు నగర పంచాయతీ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రత్యేక కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. సమావేశానికి కౌన్సిలర్లు, ఎక్స్ అఫిషియో సభ్యులంతా తప్పకుండా హాజరు కావాలని కోరారు.
పది, ఇంటర్ ప్రవేశాలకు 16న కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అంబేడ్కర్ గురుకుల పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పదో తరగతి, ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం సీట్ల భర్తీకి ఈనెల 16న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సమన్వయ అధికారి జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. కురుగుంట స్కూల్‌లో కౌన్సెలింగ్ ఉంటుందన్నారు. పదో తరగతికి సంబంధించి ఉరవకొండ స్కూల్‌లో ఎస్టీ–1, బీసీ–1, ఓసీ–1, హిందూపురం బాలికల పాఠశాలలో ఎస్సీ–7, అమరాపురంలో ఎస్టీ–1, ఓసీ–1, మలుగూరులో ఎస్సీ–2, ఎస్టీ–1 ఖాళీలున్నాయన్నారు. సీనియర్ ఇంటర్‌కు సంబంధించి... ఉరవకొండ ఎస్సీ–48, ఎస్టీ–3, బీసీ–3, ఓసీ–2, నల్లమాడలో 55, కురుగుంటలో ఎస్సీ–1, ఎస్టీ–2, బీసీ–2, హిందూపురం (బాలికలు)లో ఓసీ–1, అమరాపురంలో ఎస్సీ–1, ఓసీ–1, మలగూరులో ఎస్సీ–19, బీసీ–1 సీటు ఖాళీ ఉందన్నారు. 16న నేరుగా స్పాట్ కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని సూచించారు.
బీమా ప్రీమియం
చెల్లింపునకు నేడు ఆఖరు
అనంతపురం అగ్రికల్చర్: ఖరీఫ్‌లో వాతావరణ బీమా పథకం కింద గుర్తించిన పంటలకు ప్రీమియం చెల్లింపు గడువు మంగళవారంతో ముగియనుంది. బీమా కింద నోటిఫై చేసిన వేరుశనగ ఎకరాకు రూ.640 ప్రకారం ప్రీమియం కట్టాలి. పత్తికి రూ.1,140, దానిమ్మకు రూ.3,750, చీనీ, బత్తాయికి రూ.2,750, టమాటకు రూ.1,600, అరటికి రూ.3 వేల ప్రకారం జూలై 15 లోపు ప్రీమియం కట్టాలంటూ వారం క్రితం వ్యవసాయశాఖ ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఇంకా వేలాది మంది ప్రీమియం చెల్లించాల్సిన ఉంది. ఈ క్రమంలో ఈనెలాఖరు వరకు గడువు పొడిగించాలని జిల్లా వ్యవసాయశాఖ కమిషనరేట్ అధికారులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిసింది.

అర్జీదారుడు సంతృప్తి చెందాలి