
హెచ్చెల్సీకి నవంబర్ నెలాఖరు వరకూ నీరు
బొమ్మనహాళ్: హెచ్చెల్సీకి నవంబర్ నెలాఖరు వరకు తుంగభద్ర జలాలను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని టీబీ డ్యాం ఎస్‌ఈ నారాయణ నాయక్ తెలిపారు. సోమవారం బొమ్మనహాళ్ వద్ద ఆంధ్రా సరిహద్దులోని 105వ కిలోమీటర్ వద్ద కాలువను, రెగ్యులేటర్‌ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్‌ఈ మాట్లాడుతూ టీబీ డ్యాంకు ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టిందన్నారు. ఇటీవల డ్యాం నంచి 1,400 క్యూసెక్కుల నీటిని హెచ్చెల్సీకి వదిలామన్నారు. 105వ కిలోమీటర్ వద్దకు 500 క్యూసెక్కుల మేర వస్తున్నట్లు తెలిపారు. నవంబర్‌లో వర్షాలు వస్తే హెచ్చెల్సీకి నీటి వాటా పెంచుతామన్నారు. ఆంధ్రాలో అత్యవసర మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో నీటిని తీసుకునేందుకు ఆలస్యం కావొచ్చన్నారు. టీబీ డ్యాం గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా.. 33 క్రస్ట్ గేట్లకు మరమ్మతులు చేయాల్సిన నేపథ్యంలో 80 టీఎంసీలకు కుదించామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జూలై మొదటి వారంలోనే డ్యాం పూర్తి స్థాయిలో నిండిందన్నారు. ప్రస్తుతం 39,667 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 25,181 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదవుతోందన్నారు. డ్యాం 5 క్రస్ట్ గేట్లను రెండున్నర అడుగుల మేర ఎత్తి 14,590 క్యూసెక్కులను నదికి విడుదల చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎస్‌డీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, జేఈ రంజిత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.