
కళ్లలో కారం కొట్టి.. కత్తితో పొడిచి!
కదిరి అర్బన్: వివాహేతర సంబంధం ఓ యువకుడి హత్యకు దారి తీసింది. ఇంటి పెద్ద మృతితో ముగ్గురు చిన్నారులు అనాథలయ్యారు. ఈ ఘటన కదిరి మండలం బందార్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలిలాఉన్నాయి. బందార్లపల్లికి చెందిన నవీన్‌కుమార్ (35)కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. మగ్గం పనితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. నాలుగేళ్ల క్రితం అనారోగ్యం కారణంగా భార్య మృతి చెందింది. అప్పటి నుంచి చిన్నారుల ఆలనాపాలన చూసుకుంటూ వారిని నవీన్‌కుమార్ అల్లారుముద్దుగా పెంచుకుంటూ వస్తున్నాడు.
పెడదోవ పట్టించిన పరిచయం..
బందార్లపల్లికి చెందిన విశ్వనాథ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కదిరిలోని ఓ హోటల్‌లో విశ్వనాథ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం విశ్వనాథ్ భార్యతో నవీన్‌కుమార్‌కు పరిచయమైంది. ఈ పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయాన్ని పసిగట్టిన విశ్వనాథ్ పలుమార్లు నవీన్‌కుమార్‌ను మందలించాడు. పద్ధతి మార్చుకోవాలని హితవు పలికాడు. నవీన్‌కుమార్ తీరులో మార్పు రాకపోవడంతో చివరకు కుటుంబ సభ్యులను పిలుచుకుని విశ్వనాథ్ కదిరికి మకాం మార్చాడు. అయినా నవీన్‌కుమార్ తరచూ తన భార్యతో చాటింగ్ చేస్తూ.. అప్పుడప్పుడు వచ్చి కలిసి వెళ్లిపోవడాన్ని గమనించిన విశ్వనాథ్ ఎలాగైనా నవీన్‌కుమార్‌ను అడ్డు తొలగించి, తన కుటుంబాన్ని కాపాడుకోవాలని అనుకున్నాడు.
పథకం ప్రకారం..
ఈ క్రమంలో నవీన్‌కుమార్ హత్యకు పథకం రచించిన విశ్వనాథ్.. అతని ప్రతి కదలికపై నిఘా ఉంచాడు. శుక్రవారం ఉదయం బందార్లపల్లికి చేరుకుని గ్రామ శివారున కాపుకాశాడు. బహిర్భూమికని ఒంటరిగా వస్తున్న నవీన్‌కుమార్ ఎదురుపడగానే ఒక్కసారిగా కళ్లలో కారంపొడి చల్లాడు. అనంతరం సిద్ధంగా ఉంచుకున్న కత్తితో కడుపు, ఛాతీపై పలుమార్లు పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో నవీన్‌కుమార్ ప్రాణాలు కోల్పోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. సమాచారం అందుకున్న కదిరి రూరల్ యూజీపీఎస్ సీఐ నిరంజనరెడ్డి, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కదిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, విశ్వనాథ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.
యువకుడి ప్రాణం బలిగొన్న
వివాహేతర సంబంధం

కళ్లలో కారం కొట్టి.. కత్తితో పొడిచి!