
అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపండి
● జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్
ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజలు ఇచ్చే అర్జీల పట్ల నిర్లక్ష్యం వహించకుండా వెంటనే నాణ్యమైన పరిష్కారం చూపాలని జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని ప్రజా సమస్యల పరిష్కార వేదిక మందిరంలో కార్యక్రమం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఇల్లు, ఇంటి పట్టాలు, సామాజిక పింఛన్లు, భూ సమస్యలు తదితర అంశాలపై 172 అర్జీలు వచ్చాయి. పుట్టపర్తి డివిజన్ నుంచి 60, పెనుకొండ 44, ధర్మవరం 41, కదిరి నుండి 27 వినతులు అందాయి. అనంతరం జాయింట్ కలెక్టర్ అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి గడువులోపు పరిష్కారం చూపాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్‌ఎల్‌ఎ, రీ ఓపెనింగ్ లేకుండా అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. డీఆర్‌ఓ విజయ సారధి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు సూర్యనారాయణరెడ్డి, రామసుబ్బయ్య, పుట్టపర్తి అర్డీఓ సువర్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.