
అమాయకుల జోలికెళ్తే ఊరుకోం
పుట్టపర్తి అర్బన్: అధికారం ఉంది కదా అని అమాయకుల జోలికి వెళ్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి కూటమి నాయకులను హెచ్చరించారు. ఐదురోజుల క్రితం పుట్టపర్తి మండలం వెంగళమ్మచెరువుకు చెందిన వైఎస్సార్‌సీపీ నాయకుడు వీరనారప్ప కుటుంబీకులకు చెందిన మామిడి తోటలో సుమారు 300 చెట్లను ప్రత్యర్థులు నరికి వేసిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి శనివారం పార్టీ నాయకులతో కలిసి వెంగళమ్మచెరువుకు వెళ్లారు. మామిడి తోటకు వెళ్లి దుండగులు నరికిన చెట్లను పరిశీలించారు. బాధిత రైతులకు భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆధ్యాత్మిక నగరిగా పేరొందిన పుట్టపర్తిలోనూ రెడ్‌బుక్ రాజ్యాంగం రాజ్యమేలుతోందన్నారు. చెట్లు నరికే విష సంస్కృతికి కూటమి నేతలు బీజం వేస్తున్నారని మండిపడ్డారు. అధికారం ఎంతో కాలం ఉండదన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలన్నారు. ప్రజలు, రైతులు తిరగబడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయని హెచ్చరించారు. రైతులు ఆరుగాలం శ్రమించి కంటికి రెప్పలా కాపాడుకున్న మామిడి చెట్లను నరికి వేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచే పోలీస్ అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. వ్యవసాయమే ఆధారంగా జీవిస్తున్న రైతు వీరనారప్ప కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి వెంట ఎంపీపీ ఏవీ రమణారెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ తిప్పన్న, పార్టీ మండల, పట్టణ కన్వీనర్లు ఈశ్వరయ్య, రవినాయక్, మాజీ కన్వీనర్లు నరసారెడ్డి, గంగాద్రి, డీసీసీబీ మాజీ డైరెక్టర్ ఈశ్వరరెడ్డి, తిప్పారెడ్డి ఉన్నారు.
రాజకీయ కక్షతో పచ్చని చెట్లు కొట్టడం దుర్మార్గం
మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి