
పుట్టపర్తిలో ఢిల్లీ వాసి మృతి
పుట్టపర్తి టౌన్: సత్యసాయి సన్నిధిలో శేష జీవితం గడిపేందుకు వచ్చిన ఢిల్లీకి చెందిన సత్యకుమార్ మధుకరన్ మీనన్ (64) మృతి చెందారు. తోడు ఎవరూ లేని ఆయన కొన్ని రోజుల క్రితం పుట్టపర్తికి వచ్చి ప్రియాంక అపార్ట్‌మెంట్‌లో నివాసముంటున్నారు. నాలుగు రోజులుగా గది తలుపులు తీయలేదు. బుధవారం ఉదయం ఆయన నివాసముంటున్న గది నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో సీఐ సునీత, సిబ్బంది అక్కడకు చేరుకుని పరిశీలించారు. తలుపులు బద్దలు కొట్టి లోపలకు ప్రవేశించి, మృతదేహాన్ని గుర్తించారు. గుండె నొప్పి కారణంగా కిందపడి మృతి చెందినట్లుగా ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది. పెనుకొండలోని ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం అంత్యక్రియలు నిర్వహించినట్లు కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి దుర్మరణం
గోరంట్ల: వాహనం ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. గోరంట్ల మండలం కసిరెడ్డిపల్లి సమీపంలో ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. మంగళవారం రాత్రి రోడ్డుపై నడుచుకుంటు వెళుతున్న వ్యక్తిని వాహనం ఢీకొంది. ప్రమాదంలో రోడ్డుపై పడిన అతని తల మీదుగా వాహనం చక్కాలు దూసుకెళ్లాయి. దీంతో మృతుడు ఎవరైంది ఆచూకీ తెలియకుండా పోయింది. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ వాహనంతో పాటు ఉడాయించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం ఉదయం పరిశీలించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లుగా నిర్ధారించి, కేసు నమోదు చేశారు.
భార్యతో గొడవ..
భర్త ఆత్మహత్య
ధర్మవరం అర్బన్: స్థానిక ప్రియాంక నగర్‌లో నివాసముంటున్న లింగారెడ్డి(48) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయనకు భార్య లక్ష్మీదేవి, ఓ కుమారుడు ఉన్నారు. వంట పనితో కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో బుధవారం భార్యతో గొడవపడిన ఆయన క్షణికావేశంలో ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని కిందకు దించి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఘటనపై ధర్మవరం వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
బంగారు నగల అపహరణ
హిందూపురం: స్థానిక మార్కండేయ నగర్‌లో నివాసముంటున్న లేపాక్షి పశువైద్యశాక ఉద్యోగి కృష్ణవేణి ఇంట్లో చోరీ జరిగింది. మంగళవారం ఇంటికి తాళం వేసి కృష్ణవేణి కుటుంబసభ్యులు మరో ఊరికి వెళ్లారు. విషయాన్ని గుర్తించిన దుండగులు అదే రోజు తాళం బద్ధలుగొట్టి లోపలకు ప్రవేవించారు. బీరువాలోని 10 తులాల బంగారు నగలు, పట్టుచీరలు, విలువైన సామగ్రిని అపహరించారు. బుధవారం ఉదయం తిరిగి వచ్చిన ఇంటి యాజమాని ఇంట్లో జరిగిన చోరీని గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీంను రంగంలో దించి నిందితుల వేలి ముద్రలను సేకరించారు. ఘటనపై వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.