
నేడు పింఛన్ల పంపిణీ
పుట్టపర్తి టౌన్: అర్హులైన లబ్ధిదారులకు జూలై నెలకు సంబంఽధించి పింఛన్లను మంగళవారం పంపిణీ చేయనున్నారు. ఈ మేరకు డీఆర్‌డీఏ పీడీ నరసయ్య సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని 2,60,883 మంది లబ్ధిదారులకు రూ 114.09 కోట్లు మంజూరు కాగా, ఇందుకు సంబంఽధించిన నగదును సోమవారం బ్యాంక్‌ల నుంచి విత్‌డ్రా చేశారు. సాంకేతిక సమస్యలు తలెత్తితే 2వ తేదీ కూడా పంపిణీ ప్రక్రియ ఉంటుంది.
నేటి నుంచి తూమాటి దోణప్ప శత జయంతి ఉత్సవాలు
ఉరవకొండ: తెలుగు సాహితీ విజ్ఞాన గని, బహుభాషా పండితుడు ఆచార్య తూమాటి దోణప్ప శత జయంతి వేడుకలు మంగళవారంనుంచి హైదరాబాద్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనున్నాయి. ఉరవకొండ మండలం రాకెట్ల గ్రామానికి చెందిన దోణప్ప 1926, జూలై 1న సంజప్ప, తిమ్మక్క దంపతులకు జన్మించారు. ఆంధ్ర యూనివర్సిటీ, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో తెలుగు ఆచార్యులుగా పనిచేశారు. హైదారాబాదులో ఆవిర్భవించిన తెలుగు విజ్ఞాన పీఠం డైరెక్టరుగా, తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడిగానూ పనిచేశారు. ఆయన సాహితీ సేవలకు గుర్తుగా తెలుగు సాహితీ జగత్తు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు సన్నాహకాలు చేసింది.
గురుకులాల్లో ఇంటర్
మిగులు సీట్లకు కౌన్సెలింగ్
అనంతపురం రూరల్: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని సాంఘిక సంక్షేమ శాఖ గురుకులాల్లో ఇంటర్ మొదటి సంవత్సరంలో మిగులు సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విద్యాలయ సమన్వయ అధికారి జయలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. తమ నుంచి సమాచారం అందిన విద్యార్థులు మాత్రమే హాజరు కావాలన్నారు. ఈ నెల 2న బీ పప్పూరు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురకుల పాఠశాలలో బాలికలకు ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకు, బాలురకు 2 నుంచి 4 గంటల వరకు కౌన్సెలింగ్ ఉంటుందన్నారు.
వ్యక్తి దుర్మరణం
పెనుకొండ: కారు ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మరో ఇద్దరు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన మేరకు.. సోమందేపల్లి మండలం వెలగమాకులపల్లికి చెందిన గంగాధర్(40) తన సోదరుడు భాస్కర్, కుమారుడు ప్రణీత్‌తో కలసి సోమవారం ద్విచక్ర వాహనంపై పెనుకొండకు బయలుదేరాడు. నగర పంచాయతీ పరిధిలోని రబ్బర్ ఫ్యాక్టరీ సమీపంలోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన కారు ఢీ కొనడంతో గంగాధర్ అక్కడికక్కడే మృతి చెందాడు. భాస్కర్, ప్రణీత్ గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
ఇరు పార్టీల కార్యకర్తలపై సుమోటోగా కేసు నమోదు
తాడిపత్రి టౌన్: గత నెల 29న పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించారన్న కారణంతో టీడీపీ, వైఎస్సార్‌సీపీకి చెందిన 20 మంది కార్యకర్తలపై సుమోటోగా కేసు నమోదు చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. వీరిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రవితేజారెడ్డి, నవీన్ రెడ్డి, హనుమంతరెడ్డి, బ్రహ్మానందరెడ్డి, ప్రణయ్ తదితరులు, అలాగే టీడీపీ కార్యకర్తలు మల్లికార్జున, పరమేష్, సుదర్శన్‌రెడ్డి, ఖాదర్, యాసిన్ తదితరులు ఉన్నారు.
అనుమానాస్పద మృతి
కుందుర్పి: మండలంలోని ఎనుములదొడ్డి గ్రామానికి చెందిన వడ్డె కుమార్(42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. బేల్దారి పనులతో జీవనం సాగిస్తున్న ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. సోమవారం ఉదయం మరో ఇద్దరు కూలీలతో కలసి అదే గ్రామానికి చెందిన జోగప్పగారి హనుమంతు ఇంటి నిర్మాణ పనుల్లో కుమార్ పాల్గొన్నాడు. మధ్యాహ్నం ఉన్నఫళంగా కుప్పకూలాడు. గమనించిన హనుమంతు, తదితరులు వెంటనే కళ్యాణదుర్గంలోని సీహెచ్‌సీకి తీసుకెళ్లారు. చికిత్సకు స్పందించక కుమార్ మృతి చెందాడు. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కుమార్ కుటుంబసభ్యులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పోక్సో కేసులో
నిందితుడికి రిమాండ్
యాడికి: పోక్సో కేసులో నిందితుడిని అరెస్ట్ చేసినట్లు సీఐ ఈరన్న తెలిపారు. వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. యాడికిలోని అంకాలమ్మ వీధికి చెందిన వృద్ధుడు బోయ ఆదెప్ప మద్యం మత్తులో ఆదివారం సాయంత్రం ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. బాధిత బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఆదెప్పపై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం మధ్యాహ్నం అరెస్ట్ చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
సజావుగా ఏఎన్‌ఎంల
బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం మెడికల్: డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో సోమవారం జరిగిన ఏఎన్‌ఎంల బదిలీల కౌన్సెలింగ్ ప్రక్రియ సజావుగా జరిగింది. ఉమ్మడి జిల్లాలోని 803 మంది ఏఎన్‌ఎంలకు జూమ్ వీడియా ద్వారా డీఎంహెచ్‌ఓ డాక్టర్ భ్రమరాంబదేవి బదిలీల కౌన్సెలింగ్ చేపట్టారు. అర్ధరాత్రి వరకూ ఈ ప్రక్రియ సాగింది. సీనియర్ అసిస్టెంట్ కమలాకర్ రాజు, తదితరులు పాల్గొన్నారు. ఐదేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న 740 మందికి వారి సీనియారిటీ, ప్రగతి ఆధారంగా పోస్టింగ్ కల్పించారు.