
‘పోలీసు స్పందన’కు 60 వినతులు
పుట్టపర్తి టౌన్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వివిధ సమస్యలపై 60 వినతులు అందాయి. వినతులను ఎస్పీ రత్న స్వయంగా స్వీకరించి, బాధితులతో మాట్లాడారు. మహిళలు, వికలాంగుల వద్దకు నేరుగా వెళ్లి అర్జీలు స్వీకరించారు. సమస్య తీవ్రత తెలుసుకుని చట్టపరిధిలోని అంశాలకు తక్షణ పరిష్కారం చూపాలని సంబంధిత ఎస్‌హెచ్‌ఓలను ఆదేశించారు. అర్జీల పరిష్కారంపై అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో లీగల్ అడ్వైజర్ సాయినాథ్‌రెడ్డి, డీఎస్పీ విజయకుమార్, ఎస్‌బీ సీఐ బాల సుబ్రహ్మణ్యంరెడ్డి పాల్గొన్నారు.
‘108’లో ప్రసవం
మడకశిర రూరల్: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని ఆస్పత్రికి తరలిస్తుండగా 108 అంబులెన్స్‌లోనే ప్రసవించింది. వివరాలు.. మడకశిర మండలం హెచ్‌ఆర్ పాళ్యం గ్రామానికి చెందిన గర్భిణి మహాలక్ష్మికి ఆదివారం రాత్రి పురిటి నొప్పులు మొదలయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఆ గ్రామానికి చేరుకుని గర్భిణిని పావగడలోని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు తీవ్రమయ్యాయి. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి పైలెట్ తిమ్మప్ప సాయంతో ఈఎంటీ మంజుల ఆమెకు కాన్పు చేశారు. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఆస్పత్రికి చేర్చారు. పరీక్షించిన వైద్యులు తల్లీబిడ్డ ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. సకాలంలో స్పందించిన 108 సిబ్బందికి ఈ సందర్భంగా బాలింత కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
‘ఆత్మహత్యాయత్నం కాదు.. హత్యాయత్నం!’
ధర్మవరం అర్బన్: స్థానిక గీతానగర్‌కు చెందిన వివాహిత రమాదేవిని ఆదివారం రాత్రి ఫిట్స్ వచ్చాయంటూ కుటుంబ సభ్యులు ధర్మవరంలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని ఆస్పత్రికి తరలించారు. సోమవారం ఉదయం అనంతపురంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమాదేవిని ఆమె పుట్టింటి తరఫు బంధువులు వెళ్లి పరామర్శించారు. రమాదేవికి ఫిట్స్ రాలేదని ఉరి వేసి హత్య చేయాలని చూశారంటూ అనంతపురంలోని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ స్పందించి ఓ కానిస్టేబుల్‌ను అనంతపురంలోని ఆసుపత్రికి పంపించారు. వివాహిత ఆత్మహత్యాయత్నం చేసిందా? లేక ఎవరైనా హత్య చేసేందుకు ప్రయత్నించారా? అనేది తేలాల్సి ఉంది.

‘పోలీసు స్పందన’కు 60 వినతులు