వివాహేతర సంబంధంతోనే హత్య | - | Sakshi
Sakshi News home page

వివాహేతర సంబంధంతోనే హత్య

Jul 1 2025 4:34 AM | Updated on Jul 1 2025 4:34 AM

వివాహేతర సంబంధంతోనే హత్య

వివాహేతర సంబంధంతోనే హత్య

హిందూపురం: మూడు రోజుల క్రితం లేపాక్షి మండలంలో చోటు చేసుకున్న యువకుడి హత్య కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా నిర్ధారిస్తూ ఇద్దరిని అరెస్ట్‌ చేసి, రిమాండ్‌కు తరలించారు. హిందూపురంలోని డీఎస్పీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను డీఎస్పీ మహేష్‌ వెల్లడించారు. గత నెల 24వ తేదీ రాత్రి 10 గంటల నుంచి లేపాక్షి మండలం మైదుగోళం గ్రామానికి చెందిన రవికుమార్‌ (36) కనిపించకపోడంతో ఆయన తండ్రి బోయ అశ్వత్థప్ప ఫిర్యాదు మేరకు అదే నెల 25న పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన ఆనంద్‌, గోవిందరాజుపై అనుమానాలు వ్యక్తం కావడంతో పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేపట్టారు. అందిన సమాచారం మేరకు గత నెల 25న రాత్రి గ్రామ శివారులోని నీటి కుంటలో బయటపడిన మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అశ్వత్థప్ప కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహం తన భర్తదేనంటూ రవికుమార్‌ భార్య గీత నిర్ధారించింది. దీంతో మిస్సింగ్‌ కేసును కాస్త గీత ఫిర్యాదుతో హత్య కేసుగా మార్చి దర్యాప్తు వేగవంతం చేశారు. అనుమానితులైన గోవిందరాజు, ఆనంద్‌ను సోమవారం మధ్యాహ్నం మైదుగోళం సమీపంలో హిందూపురం రూరల్‌ సీఐ జనార్ధన్‌, లేపాక్షి ఎస్‌ఐ నరేంద్ర అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారణ చేయడంతో తామే హత్య చేసినట్లుగా అంగీకరించారు. ఆనంద్‌ భార్యతో రవికుమార్‌ వివాహేతర సంబంధం కొనసాగించేవాడని, ఈ విషయంగా పలుమార్లు మందలించినా అతని తీరు మారకపోవడంతో హతమార్చాలని నిర్ణయించుకున్నట్లుగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో గత నెల 24న సాయంకాలం మందు పార్టీ ఏర్పాటు చేసుకుందామని ఆనంద్‌ తెలపడంతో రవికుమార్‌ తన ఇంటి నుంచి చికెన్‌ చేయించుకుని బాక్స్‌లో తీసుకుని ఆనంద్‌, అతని తమ్ముడు గోవిందరాజుతో కలసి మైదుగోళం శివారులోని కురుబ లింగప్ప బీడు భూమికి చేరుకున్నారు. అక్కడ చాలా సేపటి వరకూ మద్యం తాగుతూనే ఉన్నారు. రాత్రి 10 గంటల సమయంలో రవికుమార్‌ మద్యం మత్తులో జోగుతుండగా ఇదే అదునుగా భావించి అన్నదమ్ములు ముందుగానే సిద్ధం చేసుకున్న వేటకొడవలితో నరికారు. మొండెం నుంచి వేరుపడిన తలను ప్లాస్టిక్‌ సంచిలో వేసి, మొండెంతో పాటు లింగప్ప పొలంలోనే ఉన్న నీటి కుంటలో పడేసి వెళ్లిపోయారు. నిందితులు నేరాన్ని అంగీకరించడంతో వారి నుంచి హత్యకు ఉపయోగించిన వేటకొడవలి, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.

యువకుడి హత్యకేసులో వీడిన మిస్టరీ

నిందితుల అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement