
పోలీసుల అదుపులో టీడీపీ నేత
● సొంత పార్టీ నేతపై దాడిలో ప్రమేయం
పెనుకొండ/రూరల్: మండలంలోని మునిమడుగు గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ చిన్న వెంకటరాముడిని కొత్తచెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల మునిమడుగుకు చెందిన టీడీపీ నాయకుడు ఆంజనేయులు అలియాస్ బేనీషా కొత్తచెరువు నుంచి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలో ముగ్గురు వ్యక్తులు దాడి చేసి తీవ్రంగా కొట్టారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు హుటాహుటిన అనంతపురంలోని ఆస్పత్రికి తరలించి కాపాడుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అంశాన్ని ఎస్పీ రత్న తీవ్రంగా పరిగణించి సమగ్ర దర్యాప్తునకు ఆదేశించడంతో దాడికి కారకులైన ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. దీంతో దాడికి తమను ప్రేరేపించింది చిన్న వెంకటరాముడని వారు అంగీకరించినట్లు సమాచారం. దీంతో సోమవారం వేకువజామున చిన్న వెంకటరాముడిని కొత్తచెరువు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి చేసిన ముగ్గురితో పాటు చిన్న వెంకటరాముడిని సీరియస్‌గా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయం చర్చనీయాంశమైంది.
ట్రాక్టర్ కింద పడి విద్యార్థి మృతి
లేపాక్షి: మండలంలోని ఉప్పరపల్లికి చెందిన రైతు శ్రీనివాసులు కుమారుడు జశ్వంత్(19) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు.. అన్నమయ్య జిల్లా మదనపల్లిలోని పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లొమా ఫైనలియర్ చదువుతున్న జశ్వంత్ ఇటీవల సెలవుపై స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయంశ్రీనివాసులు పంటకు నీరు కట్టేందుకు వెళ్లిన సమయంలో జశ్వంత్ తోడు వెళ్లాడు. పంటకు తాను నీరు కడతానని, ఇతర పనులేమైనా ఉంటే చూసుకోవాలని తెలపడంతో పని అప్పగించి తండ్రి ద్విచక్ర వాహనంపై వెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత పక్క పొలం రైతు పొలంలోకి ట్రాక్టర్‌తో మట్టిని తరలిస్తుండడం గమనించిన జశ్వంత్... డ్రైవర్‌ను మాట్లాడించేందుకు వెళ్లాడు. ట్రాక్టర్ ఇంజన్‌కు ట్రాలీకి మధ్యలో నిలబడి మాట్లాడుతూ పొలం వైపుగా వెళుతుండగా అదుపు తప్పి ట్రాలీ చక్రాల కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. డ్రైవర్ వెంటనే ట్రాక్టర్‌ను ఆపి క్షతగాత్రుడిని బయటకు లాగి 108 వాహనంలో చికిత్స నిమిత్తం హిందూపురంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లాడు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడి తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.