అరటి సాగులో ఆదర్శం | - | Sakshi
Sakshi News home page

అరటి సాగులో ఆదర్శం

Jun 28 2025 5:53 AM | Updated on Jun 28 2025 8:53 AM

అరటి

అరటి సాగులో ఆదర్శం

పెనుకొండ: అరటి సాగులో పెనుకొండ నగర పంచాయతీ పరిధిలోని మంగాపురం గ్రామానికి చెందిన గోపాలరెడ్డి వైవిధ్యాన్ని కనబరుస్తూ పలువురిని ఆకర్షిస్తున్నారు. బెంగళూరులోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆయన కుటుంబసభ్యులతో కలసి మహానగరంలోనే నివాసముంటున్నారు. అయితే వ్యవసాయంపై మక్కువ ఉన్న ఆయన తరచూ అక్కడి నుంచి రాకపోకలు సాగిస్తూ గ్రామంలో తనకున్న 3.75 ఎకరాల్లో యాలక్కి రకం అరటి సాగు చేపట్టారు. ప్రస్తుతం కోత దశలో ఉన్న అరటి గెలలను బెంగళూరుకు చెందిన వ్యాపారులకు టన్ను రూ. 50 వేల చొప్పున విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు.

రూ. 26 లక్షల ఖర్చు..

తన తమ్ముడి సహకారంతో యాలక్కి అరటి సాగులో అంతర్‌పంటగా వక్క, టెంకాయ చెట్లను గోపాలరెడ్డి పెంచుతున్నారు. ఈ క్రమంలో పొలం చుట్టూ ఫెన్సింగ్‌, బోరు వేయించడం, డ్రిప్‌ ఏర్పాటు, షెడ్‌ నిర్మాణం, వీడర్‌ కొనుగోలు, పొలం చదును, కూలీలు, ఇతర ఖర్చులు కలిపి దాదాపు రూ.26 లక్షల వరకూ వెచ్చించారు. కర్ణాటకలోని నెలమంగల సమీపంలో ఉన్న ఫ్రీన్‌లీ బనానా కంపెనీ నుంచి టిష్యూ కల్చర్‌ అరటి ఒక్కో మొక్కను రూ.30 చొప్పున, శివమొగ్గ సమీపంలోని తీర్థహళ్లి నుంచి వక్క మొక్కలు, చెళ్లకెర నుంచి ఒక్కో టెంకాయ మొక్కను రూ.380తో కొనుగోలు చేశారు. మొత్తం 2,500 అరటి మొక్కలు, 1,800 వక్క, 110 టెంకాయ మొక్కలను ఒకేసారి పొలంలో నాటి సాగు చేపట్టారు. ప్రస్తుతం చేతికి అందివచ్చిన తొలిదశ అరటి పంటను విక్రయించగా రూ.3.50 లక్షల ఆదాయం సమకూరింది. మరో రెండు కోతల పంట చేతికి వచ్చే అవకాశముంది. అరటి పిలకలను విక్రయిస్తుంటారు. ఒక్కో పిలకను రూ.20 నుంచి రూ.25 చొప్పున కొనుగోలు చేసుకుని వెళుతుంటారు. అరటి ఆకులను బెంగళూరుకు తరలించి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం అరటి మొక్క బోద నుంచి లభ్యమయ్యే గడ్డను ఇతర రైతులు తీసుకెళ్లి తమ పొలాల్లో పంట పెట్టుకుంటున్నారు. ఒక్కో గడ్డను రూ.15 చొప్పున విక్రయిస్తున్నారు.

అంతర్‌ పంటలుగా వక్క, టెంకాయ

బెంగళూరులో నివాసముంటూ

సొంతూరిలో వ్యవసాయం

సాగును భారంగా భావిస్తున్న ప్రస్తుత తరుణంలో ఓ ఉద్యోగి పంటల సాగుపై మక్కువ పెంచుకున్నాడు. వృత్తి రీత్యా బెంగళూరులో స్థిరపడినా... సొంతూరులోని పొలంలో వివిధ రకాల పంటలను సాగు

చేస్తూ పలువురికి ఆదర్శంగా నిలిచాడు.

అవగాహనతోనే పంటల సాగు

పంటల సాగుపై అనుభవం ఉంది. పిల్లల భవిష్యత్తు కోసం బెంగళూరులో నివాసముంటూ భార్యతో కలసి ప్రైవేట్‌ కంపెనీలో పనిచేస్తున్నా. గ్రామంలో పెద్దల నుంచి సంక్రమించిన 3.75 ఎకరాల పొలాన్ని బీడుగా మార్చడం ఇష్టం లేక అరటి సాగు చేపట్టాను. భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని అంతర్‌ పంటగా వక్క, టెంకాయ చెట్లను పోషిస్తున్నా. వృద్ధురాలైన తల్లి, వికలాంగుడైన తమ్ముడు తోడుగా ఉంటున్నారు. పంట సాగులో రైతులెవరైనా నా సహకారం కావాలనుకుంటే 974047 1698కు ఫోన్‌ చేసి సలహాలు తీసుకోవచ్చు. – గోపాలరెడ్డి, రైతు

అరటి సాగులో ఆదర్శం 1
1/2

అరటి సాగులో ఆదర్శం

అరటి సాగులో ఆదర్శం 2
2/2

అరటి సాగులో ఆదర్శం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement