
కంటైనర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
● ఆరుగురు ప్రయాణికులకు గాయాలు
చిలమత్తూరు: రోడ్డు పక్కన ఆపిన కంటైనర్‌ను వేగంగా దూసుకొచ్చిన ఓల్వో బస్సు ఢీకొంది. పోలీసులు తెలిపిన మేరకు.. కర్ణాటకలోని రాయచూరు నుంచి బెంగళూరుకు 33 మంది ప్రయాణికులతో వీఆర్‌ఎల్ ట్రావెల్స్‌కు చెందిన ఓల్వో బస్సు బయలుదేరింది. శుక్రవారం తెల్లవారుజామున చిలమత్తూరు మండల పరిధిలోని 44వ జాతీయ రహదారిపై కోడూరు తోపు సమీపంలో ఉన్న గార్మెంట్స్ పరిశ్రమ వద్దకు చేరుకోగానే అప్పటికే రోడ్డు పక్కన ఆపిన కంటైనర్ ఆలస్యంగా గమనించిన ఓల్వో డ్రైవర్ వేగాన్ని నియంత్రించేలోపు నేరుగా వెళ్లి ఢీకొంది. ఘటనలో ఆరుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా తొలుత కర్ణాటకలోని బాగేపల్లిలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరుకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కంటైనర్ నుంచి బస్సును వేరు పరిచి ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు చిలమత్తూరు పీఎస్ ఎస్‌ఐ మునీర్ అహమ్మద్ తెలిపారు.
చెరువుల్లో మట్టిని
తరలించుకోండి : మంత్రి సవిత
పెనుకొండ: అవసరాన్ని బట్టి చెరువుల్లోని మట్టిని తరలించుకోవాలని రైతులకు మంత్రి సవిత సూచించారు. ఈ విషయంగా అధికారులు ఎవరూ అడ్డు చెప్పరని అన్నారు. స్థానిక తన కార్యాలయంలో నియోజకవర్గ సాగునీటి సంఘం అధ్యక్షులతో శుక్రవారం ఆమె సమావేశమై మాట్లాడారు. రైతులు మట్టి తోలుకునేందుకు ట్రాక్టర్‌కు రూ.3 చెల్లిస్తే చాలన్నారు. నియోజకవర్గంలోని సాగునీటి కాలువల్లో జంగిల్ క్లియరెన్స్, మట్టి తవ్వకాలకు రూ. 3.50 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. రూ.50 కోట్లతో నియోజకవర్గంలోని 26 చెరువులను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. జంగిల్ క్లియరెన్స్‌కు మంజూరైన రూ.50 లక్షల నిధులతో కాలువల్లో ముళ్ల పొదల తొలగింపు, పూడిక తీత పనులు చేపట్టనున్నామన్నారు. అయితే ఈ నిధుల వినియోగానికి జీఎస్టీ సమస్య వుందని త్వరలో పరిష్కరించి పనులు ప్రారంభిస్తామన్నారు.
సీఎం పర్యటనకు
ఏర్పాట్ల పరిశీలన
పుట్టపర్తి టౌన్: ‘తల్లికి వందనం’ పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జూలై 5వ తేదీన కొత్తచెరువులో పర్యటించే అవకాశం ఉండటంతో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ వి. విజయరామరాజు కలెక్టర్ చేతన్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే సింధూరారెడ్డితో కలిసి కొత్తచెరువులో పర్యటించారు. జూనియన్ కళాశాల, జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరిసర ప్రాంతాలు, గదులను పరిశీలించారు. సీఎం పర్యటన ఏర్పాట్ల గురించి సంబంఽధిత అధికారులకు సూచనలిచ్చారు. అనంతరం సత్యసాయి విమానాశ్రయాన్ని పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. అలాగే విమానాశ్రయంలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు.
మట్కా రాస్తున్న మహిళల అరెస్ట్
తాడిపత్రి టౌన్: పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో మట్కా రాస్తున్న ముగ్గురు మహిళలను అరెస్ట్ చేసినట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. అందిన సమాచారం మేరకు శుక్రవారం తనిఖీలు చేపట్టి పక్కా ఆధారాలతో సరస్వతి, కుళ్లాయమ్మ, జ్యోతిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.1.30 లక్షల నగదు, సెల్‌ఫోన్లు, మట్కా పట్టీలు స్వాధీనం చేసుకున్నామన్నారు.

కంటైనర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు

కంటైనర్‌ను ఢీకొన్న ట్రావెల్స్ బస్సు