
షార్ట్ సర్క్యూట్‌తో ఎరువుల దుకాణం దగ్ధం
బత్తలపల్లి: విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా చెలరేగిన మంటల్లో ఓ ఎరువుల దుకాణం దగ్ధమైంది. బాధితుడు తెలిపిన మేరకు.. బత్తలపల్లికి చెందిన మోహన్‌రెడ్డి స్థానిక కదిరి మార్గంలో 30 ఏళ్లుగా ఎరువుల దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం లావాదేవీలు ముగించుకున్న అనంతరం రాత్రి దుకాణానికి తాళం వేసి ఇంటికి వెళ్లాడు. అర్థరాత్రి సమయంలో దుకాణంలో నుంచి పొగలు వస్తుండడంతో గమనించిన గస్తీ పోలీసులు సమాచారం అందివ్వడంతో వెంటనే యజమాని అక్కడు చేరుకుని షట్టర్ తెరిచాడు. అప్పటికే అక్కడకు చేరుకున్న రైతులు రెండు ట్రాక్టర్ ట్యాంకర్ల నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. విషయం తెలుసుకున్న ధర్మవరంలోని అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలు ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు నిర్ధారించారు. ఈ ఘటనతో దాదాపు రూ.3 కోట్ల విలువ చేసే ఎరువులు, పురుగు మందులు, వివిధ రకాల విత్తనాలు, ఇతర సామగ్రి కాలి బూడిదైనట్లు బాధిత యజమాని వాపోయాడు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన, కమ్యూనిస్టు పార్టీల నాయకులు తరలివచ్చి మోహన్‌రెడ్డికి ధైర్యం చెప్పారు. కోలుకునేందుకు అవసరమైన సాయం చేస్తామని భరోసానిచ్చారు. ఘటనపై బత్తలపల్లి పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.