
సబ్సిడీ బియ్యం పట్టివేత
రాప్తాడు: అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేసులు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి గ్రామానికి చెందిన నరేష్ 42 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని కర్ణాటకలోని పావగడకు బొలెరో వాహనంలో తరలిస్తూ శుక్రవారం రాప్తాడులోని వైఎస్సార్ సర్కిల్‌లో పట్టుపడ్డాడన్నారు. వాహనాన్ని సీజ్ చేసి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని స్టాక్ పాయింట్‌కు తరలించినట్లు వివరించారు. తనిఖీల్లో సీఐ శ్రీహర్ష, సీఎస్‌డీటీ జ్యోతి పాల్గొన్నారు.
క్షుద్ర పూజల కలకలం
నల్లచెరువు: స్థానిక పూలకుంట రోడ్డులోని తాటిచెర్ల బ్రదర్స్ క్రికెట్ మైదానంలో ముగ్గులు, కోడిగుడ్లు వేసి క్షుద్ర పూజలు నిర్వహించారు. క్రికెట్ మైదానంలో క్షుద్ర పూజలు నిర్వహించడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆటలో గెలుపు కోసమా? లేదా, క్రీడాకారులపై క్షుద్ర పూజలు చేశారా? అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. కాగా, మండల కేంద్రంలోని ఓ మొబైల్ షాప్ వద్దనూ ఇలాగే పూజలు చేశారు. బుధవారం అమావాస్య సందర్భంగా ఈ పూజలు నిర్వహించినట్లు సామాజిక మాద్యమాల్లో వైరల్ కావడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జూదరుల అరెస్ట్
తలుపుల: మండలంలోని భూపతివారిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో పేకాట ఆడుతున్న వారిని అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ నరసింహుడు తెలిపారు. అందిన సమాచారంతో శుక్రవారం తనిఖీలు చేపట్టి 13 మందిని అరెస్ట్ చేసి, రూ. 68,200 నగదు, 6 ద్విచక్ర వాహనాలు, 13 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.