
పీఆర్‌లో నేడు బదిలీల కౌన్సెలింగ్
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సచివాలయ ఉద్యోగులకు శనివారం అనంతపురంలోని పంచాయతీరాజ్ శాఖ కార్యాలయంలో బదిలీల కౌన్సెలింగ్ చేపట్టనున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టి సంఖ్యను కుదించింది. దీంతో 534 సచివాలయాలు మాత్రమే మనుగడలో ఉన్నాయి. ఈ లెక్కన ఐదేళ్లు పూర్తయిన వారు 315 మంది, ఐదేళ్ల కంటే తక్కువ సర్వీసు కలిగిన వారు 147 మంది ఉన్నారు. ఖాళీలు 72 ఉన్నట్లు తేల్చారు.
యువకుడి దుర్మరణం
కనగానపల్లి: కారు టైర్ పేలడంతో చోటు చేసుకున్న ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం పాలయ్యాడు. వివరాలు.. కేరళలోని ఎంబీబీఎస్ కళాశాలలో సీటు దక్కిన తన కుమారుడు హెయాన్స్ నాయక్ (20)ను ఆ కళాశాల చేర్పించేందుకు మహారాష్ట్రలోని అమరావతికి చెందిన మనీషాబాయి తన సమీప బంధువుతో కలసి కారులో వెళ్లారు. అడ్మిషన్ ప్రక్రియ ముగించుకున్న అనంతరం శుక్రవారం ఉదయం కారులో తిరుగు ప్రయాణమయ్యారు. కనగానపల్లి మండలం మామిళ్లపల్లి వద్దకు చేరుకోగానే 44వ జాతీయ రహదారిపై కారు ముందు చక్రానికి అమర్చిన టైరు పేలి రహదారి పక్కన ఉన్న గుంతలోకి బోల్తా పడింది. హెయన్స్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మనీషాబాయి, బంధువు సందీప్ నాయక్, డ్రైవర్ సమీర్ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను 108 అంబులెన్స్ ద్వారా అనంతపురం తరలించారు. ఘటనపై కనగానపల్లి పీఎస్ పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.