
తండ్రిపై తనయుడి కొడవలితో దాడి
పరిగి: తాను అడిగిన డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో తండ్రిపై తనయుడు కొడవలితో దాడి చేసి, గాయపరిచాడు. పోలీసులు తెలిపిన మేరకు.. పరిగి మండలం ఎర్రగుంటలో నివాసముంటున్న వృద్ధుడు మోదప్పగారి క్రిష్టప్పకు భార్యతో పాటు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించుకునేవారు. కొన్నేళ్లుగా సోరియాసిస్‌తో బాధపడుతున్న రెండో కుమారుడు శంకర.. చికిత్స నిమిత్తం తరచూ తండ్రితో డబ్బులు అడిగేవాడు. శుక్రవారం ఉదయం 6 గంటల సమయంలో ఆస్పత్రికి వెళ్లేందుకు డబ్బు కావాలని తండ్రిని అడిగాడు. తన వద్ద డబ్బు లేదని తండ్రి తెలపడంతో శంకర ఘర్షణ పడి కొడవలితో దాడి చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే దాడిని అడ్డుకుని క్షతగాత్రుడిని హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ప్రథమ చికిత్స అనంతరం బెంగళూరుకు తీసుకెళ్లారు. క్రిష్టప్ప భార్య గోవిందమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ రంగడుయాదవ్ తెలిపారు.