
గంజాయి సాగు, రవాణాకు పాల్పడితే జిల్లా బహిష్కరణ
అనంతపురం: గంజాయి సాగు, వినియోగం, అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించబోమని అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషి హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. గంజాయి, ఇతర నిషేధిత మత్తు పదార్థాల సాగు, వినియోగం, అక్రమ రవాణా వంటి కార్యకలాపాలకు పాల్పడిన వారిని జిల్లా నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటామన్నారు. మత్తు పదార్థాల నియంత్రణలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమని స్పష్టం చేశారు. మత్తుపదార్థాల వినియోగంతో వ్యక్తి శారీరక, మానసిక ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని, వినియోగదారులు విచక్షణ కోల్పోయి నేర ప్రవృత్తిని అలవర్చుకుంటారని అన్నారు. గంజాయి పొగ రూపంలో తీసుకుంటే ఊపిరితిత్తుల సమస్యలు, దీర్ఘకాలంలో ప్రాణాప్రాయం తలెత్తుతుందన్నారు. గంజాయి, డ్రగ్స్ వాడకం వల్ల కుటుంబాల అభివృద్ధి దెబ్బతింటుందన్నారు. డ్రగ్స్ రవాణాకు పాల్పడిన వారిపై పీడీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి, చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్ నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.