
అండగా ఉంటాం.. అధైర్యపడొద్దు
పుట్టపర్తి టౌన్: మృతి చెందిన పోలీసు ఉద్యోగుల కుటుంబాలకు శాఖ తరుఫున అండగా ఉంటామని ఎస్పీ రత్న భరోసానిచ్చారు. జిల్లా అటాచ్‌మెంట్‌తో పనిచేస్తున్న అనంతపురం డీటీసీ సీఐ పవన్‌కుమార్ అనారోగ్యంతో బాధపడుతూ గురువారం ఉదయం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రత్న... అనంతపురంలోని మృతుడి స్వగృహానికి చేరుకుని పవన్‌కుమార్ మృతదేహానికి నివాళులర్పించారు. తక్షణ సాయం కింద రూ.75 వేలను కుటుంబ సభ్యులకు అందజేసి, పరామర్శించారు. అధైర్య పడరాదని, అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన సౌలభ్యాలను త్వరలో అందేలా చొరవ తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా, 1998లో ఎస్‌ఐగా పోలీస్ శాఖలో చేరిన పవనర్‌కుమార్... శ్రీసత్యసాయి జిల్లా పరిధిలోని రొద్దం, సోమందేపల్లి, మండలాల్లో పనిచేశారు. అనంతరం పదోన్నతిపై సీఐగా పుట్టపర్తి అటాచ్‌మెంట్‌తో అనంతపురం డీటీసీలో పనిచేస్తున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయనకు బార్యతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.