
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో ఆరుగురికి చోటు
పుట్టపర్తి టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అనుబంధ సంఘాల నియామకంలో జిల్లాకు చెందిన ఆరుగురికి అవకాశం కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర రైతు సంఘం విభాగం సెక్రటరీగా పీవీ భాస్కర్‌రెడ్డి (పుట్టపర్తి నియోజవర్గం) జాయింట్ సెక్రటరీలుగా ఎన్ రంగారెడ్డి, ఎం.వెంకటరెడ్డి (పుట్టపర్తి నియోజవర్గం), రాష్ట్ర ఐటీ విభాగం జనరల్ సెక్రటరీగా నల్లపరెడ్డి (రాప్తాడు), ఐటీ విభాగం సెక్రటరీలుగా రోహిత్‌రెడ్డి, (రాప్తాడు) సి.జయపాల్‌రెడ్డి (పుట్టపర్తి)లను నియమించారు.
కృషి విజ్ఞాన కేంద్రం
స్థాపనకు చర్యలు
బత్తలపల్లి: మండల పరిధిలోని అప్పరాచెరువు గ్రామం వద్ద కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) స్థాపనకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా డాక్టర్ వైఎస్సార్ తోటగతి వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిపుణుల కమిటీని ప్రభుత్వం నియమించింది. కమిటీలో డాక్టర్ సి.మధుమతి(అసోసియేట్ డైరెక్టర్, రాయలసీమ జోన్) అధ్యక్షత వహిస్తుండగా, సభ్యులుగా డాక్టర్ కె.సుబ్రమణ్యం, డాక్టర్ ఎం.శివప్రసాద్, డాక్టర్ ఎం.బాలకృష్ణ ఉన్నారు. గురువారం నిపుణుల బృందం అప్పరాచెరువు సమీపంలోని సర్వే నంబర్లు 96, 97, 63లో కలిపి కేటాయించిన 68 ఎకరాల భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మట్టి నమూనాలు సేకరించి శాసీ్త్రయ పరీక్షల కోసం ల్యాబ్‌కి పంపారు.
భూసేకరణపై గ్రామ సభలు
ప్రశాంతి నిలయం: సోలార్ పవర్ ప్రాజెక్టుల ఏర్పాటుకై భూసేకరణపై గ్రామ సభలు నిర్వహించాలని కలెక్టర్ టి.ఎస్.చేతన్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో సోలార్ పవర్ ప్రాజెక్టులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూసేకరణ ప్రక్రియలో భాగంగా సంబంధిత గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి, ప్రజల అభిప్రాయాలను పొందిన తర్వాత సమగ్ర నివేదికలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
సోషల్ మీడియా
కార్యకర్త అరెస్ట్
మడకశిర: మండలంలోని గుండుమల గ్రామానికి చెందిన సోషల్ మీడియా కార్యకర్త దళిత మంజునాథ్‌ను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని మడకశిర పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పట్టణ టీడీపీ కార్యకర్త ఈశ్వరప్ప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు సీఐ నగేష్ తెలిపారు. మంజునాథ్‌ని మడకశిర కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రిమాండ్‌కు ఆదేశించినట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా.. మంజునాథ్ అరెస్ట్‌ను వైఎస్సార్‌సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వైసీ గోవర్ధన్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆనందరంగారెడ్డి, కుంచిటి వక్కలిగ వైఎస్సార్‌సీపీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రంగేగౌడ్, వైఎస్సార్‌సీపీ ఎస్సీ విభాగం నాయకుడు అశ్వత్థనారాయణ, ఎస్సీ సెల్ కార్యదర్శి మంజునాథ్ తదితరులు తీవ్రంగా ఖండించారు.
పనస కాయల
వాహనం బోల్తా
కనగానపల్లి: బెంగళూరు నుంచి అనంతపురానికి పనస కాయల లోడ్‌తో వెళుతున్న బొలెరో వాహనం కనగానపల్లి మండలం మామిళ్లపల్లి సమీపంలో 44వ జాతీయ రహదారిపై బోల్తాపడింది. గురువారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. మామిళ్ల పల్లి సమీపంలోని గ్లాస్ ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే వాహనం ముందరి టైర్లు రెండూ ఒక్కసారిగా పేలాయి. దీంతో రోడ్డుకు అడ్డంగా వాహనం బోల్తాపడింది. పనస కాయలన్నీ రోడ్డుపై చెల్లాచెదురయ్యాయి. ఘటనతో రూ.30 వేల మేర నష్టం వాటిల్లినట్లు అనంతపురానికి చెందిన వ్యాపారి పోతులయ్య వాపోయాడు. కాగా, ప్రమాదంలో ఎవరూ గాయపడలేదు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల్లో ఆరుగురికి చోటు