
అలా ముగించేశారు!
అనంతపురం ఎడ్యుకేషన్: ఎంటీఎస్ టీచర్ల విషయంలో ప్రభుత్వం ఏమాత్రం తగ్గలేదు. ‘తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు’ అన్న చందంగా మొండివైఖరితో ముందుకెళ్లింది. ఫలితంగా తక్కువ వేతనంతో పని చేస్తున్న వీరందరూ జిల్లా సరిహద్దు మండలాలకు వెళ్లాల్సి వచ్చింది. మొత్తం మీద వారిగోడును ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా అలా ముగించేశారు. తొలిరోజు 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తికాగా, రెండోరోజు గురువారం 1998 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు పూర్తి చేశారు. మధ్యాహ్నం 2 గంటలకు స్థానిక సైన్స్ సెంటర్‌లో కౌన్సెలింగ్ ఉంటుందంటూ ఉదయం అందరికీ మెసేజ్‌లు పెట్టారు. కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందు ఖాళీల అంశంపై మాట్లాడే ప్రయత్నం చేసినా...డీఈఓ ప్రసాద్‌బాబు అంగీకరించలేదు. తన పరిధిలో లేని అంశం అని... కమిషనర్ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని తేల్చి చెప్పారు. ఇప్పటికీ ఎవరైనా కౌన్సెలింగ్‌కు అటెండ్ కామని చెబితే మాత్రం అలాంటి వారికి నేరుగా కమిషనర్ కార్యాలయం నుంచే స్కూళ్లు అలాట్ చేస్తారని, అవి ఎక్కడొస్తాయో కూడా తెలీదంటూ స్పష్టం చేశారు. ఇప్పటికే రెండుమార్లు కౌన్సెలింగ్‌ను బాయ్‌కాట్ చేసినా ప్రభుత్వం కరుణించలేదని ఎంటీఎస్ టీచర్లు వాపోయారు. తక్కువ వేతనంతో పని చేస్తున్న తమపై ఇంత కక్షసాధింపుగా వ్యవహరించడం సరికాదని వాపోయారు. ఎట్టకేలకు అందరూ అంగీకరించడంతో మధ్యాహ్నం 3.30 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అర్ధరాత్రి దాకా కొనసాగింది. 404 మంది కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. ముందురోజు 190 మందికి 2008 డీఎస్సీ ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తి చేశారు. నిబంధనల మేరకే ఉన్న ఖాళీలను చూపించామని డీఈఓ ప్రసాద్‌బాబు తెలిపారు. ఏదిఏమైనా కౌన్సెలింగ్‌కు సహకరించి ప్రశాంతంగా జరిగేలా చేసిన ఎంటీఎస్ టీచర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు.
ప్రభుత్వానికి పట్టని
ఎంటీఎస్ టీచర్ల గోడు
బలవంతంగా బదిలీల కౌన్సెలింగ్
1998 ఎంటీఎస్ టీచర్లకూ
పూర్తయిన బదిలీలు
దాదాపు సరిహద్దు మండలాలకు ఎక్కువగా కేటాయింపు