
లుక్ పేరుతో బుక్ చేసేశారు!
అనంతపురం: రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేల ఆదాయం వస్తుందని నమ్మించారు. రూ.20,300 చెల్లిస్తే.. నిత్యం రూ.700 ఆదాయం వస్తుందని గాలం వేశారు. చివరికి రూ.కోట్లలో డిపాజిట్ చేయించుకుని బుక్ చేసేశారు. వివరాలు.. అమెరికన్ కంపెనీ ‘లుక్’ పేరుతో యాప్‌ను ప్రవేశపెట్టారు. పుస్తకాలు, గ్రంథాలు ఆన్‌లైన్‌లో చదివే ‘లుక్’ యాప్‌లో చందాదారుల పేరుతో దోపిడీ ప్రారంభించారు. రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ రూ.16 వేలు ఆదాయం వస్తుందని నమ్మించారు. ప్రతి బుధవారం నగదు డ్రా చేసుకునే వెసులుబాటు కల్పించారు. రూ.20,300 చెల్లిస్తే.. రోజూ రూ.700 ఆదాయం వస్తుంది. ప్రతి రోజూ యాప్‌లో 25 టాస్క్‌లు ఉంటాయి. వీటిపై క్లిక్ చేస్తే ఒక్కో టాస్క్‌కు రూ.28లు నగదు క్రెడిట్ అవుతుంది. ఇలా ప్రతి బుధవారం నగదు డ్రా చేసుకోవచ్చు. కొత్త ఖాతాదారులను చేర్పిస్తే 30 శాతం వెంటనే నగదు ఖాతాలోకి జమ అవుతుంది. ఇలా ప్రారంభంలో అత్యంత నమ్మకంగా, కచ్చితంగా మొత్తాలను చెల్లించారు. అనంతపురం నగరంలోనే రూ.20 వేల చందాదారులు వేలల్లో ఉన్నారు. రూ.2.50 లక్షల చందాదారులు వందల్లో ఉన్నారు. బుధవారం డ్రా చేసుకునేందుకు క్లిక్ చేయగా, తక్షణమే 30 శాతం చెల్లిస్తే.. ఈ 30 శాతం ఖాతాలో ఉన్న మొత్తం అంతా డ్రా చేసుకోవచ్చని యాప్‌లో మెసేజ్ చేశారు. దీంతో బుధవారం అర్ధరాత్రి 12 గంటల వరకు పోటీ పడి నగదు డిపాజిట్ చేశారు. అప్పులు చేసి మరీ డిపాజిట్ చేశారు. బుధవారం రాత్రి రూ.2.50 లక్షలు చెల్లించిన వారే అధికంగా ఉన్నారు. రూ.20 వేలు చెల్లించిన చందాదారులు తక్షణమే రూ.6,090 చెల్లించాలి. లేదంటే ఖాతా క్లోజ్ చేస్తామని హెచ్చరించారు. దీంతో ఉన్న ఫలంగా రూ.6,090 చెల్లించారు. ఇలా ఖాతాదారులకు అత్యాశ చూపించి బుధవారం రాత్రే అధికంగా మొత్తాలను కట్టించుకున్నారు. డబ్బు డ్రా చేయడంతో బ్యాంకు ప్రాసెస్‌లో ఉందంటూ గురువారం రాత్రి యాప్‌లో డేటాను తొలగించేశారు. దీంతో ఖాతాదారులు లబోదిబోమంటున్నారు. ‘లుక్’ పేరుతో కోట్లాది రూపాయలు దోచేశారని ఆందోళన చెందుతున్నారు. సైబర్ క్రైం హెల్ప్‌లైన్ నెంబర్ 1930కు ఫోన్లు చేస్తున్నారు.
రూ.వందల కోట్లు డిపాజిట్
చేయించుకుని మోసం చేసిన వైనం
రూ.2.50 లక్షలు చెల్లిస్తే రోజూ
రూ.16 వేల ఆదాయం అంటూ గాలం
అపరిమితంగా ఖాతాదారులను
పెంచుకుని బురిడీ