
మా వాహనాలకు క్లియరెన్స్ ఇప్పించండి
● పౌరసరఫరాల కమిషనర్‌ను కోరిన
ఎండీయూ ఆపరేటర్లు
ధర్మవరం: రేషన్ బియ్యం పంపిణీ నుంచి తమను తప్పించినందున వెంటనే తమ వాహనాలకు క్లియరెన్స్ ఇప్పించాలని ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కోరారు. ఈ మేరకు వారు విజయవాడలోని సెక్రటేరియట్‌లో పౌరసరఫరాల కమిషనర్ సౌరబ్‌గౌర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ఎండీయూ ఆపరేటర్స్ యూనియన్ రాష్ట్ర నాయకులు కిశోర్, సూర్యనారాయణ, రవికుమార్, సతీష్, దేవసహాయం, సుధాకర్‌రెడ్డి, సాంబశివరావు, రామంజనేయులు, సునీల్, వెంకట్, కేశవ, అక్బర్, హరి, కమలాకర్, ప్రతాప్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ...ప్రజలకు ఉపయోగపడే ఎండీయూ వ్యవస్థను కూటమి ప్రభుత్వం రద్దు చేయడంతో వాహనాలపై ఆధారపడిన ఆపరేటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. చాలా మంది జీవనం దుర్భరంగా మారిందన్నారు. ఎండీయూ వ్యవస్థను ఎలాగూ రద్దు చేసినందున తమ వాహనాలకు క్లియరెన్స్ ఇప్పించడంతో పాటు బకాయిలను వెంటనే ఇప్పించాలని కోరారు. అలాగే తమకు ప్రత్యామ్నాయంగా ఉపాధి చూపించాలని కోరారు. తమ సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని కమిషనర్ హామీ ఇచ్చినట్లు వారు వెల్లడించారు.
ఆర్‌ఎస్‌కే సిబ్బంది
బదిలీలకు గ్రీన్‌సిగ్నల్
అనంతపురం సెంట్రల్: రైతు సేవా కేంద్రాల (ఆర్‌ఎస్‌కే) సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఐదేళ్లు పూర్తయిన వారికి ఆఫ్‌లైన్‌లో, ఐదేళ్లలోపు సిబ్బంది రిక్వెస్ట్ బదిలీ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. రిక్వెస్ట్ బదిలీ ఉద్యోగులను వారి సొంత మండలంలో కాకుండా ఇతర మండలాల్లో పోస్టింగ్ కల్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నెలాఖరులోగా ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ నేపథ్యంలో కౌన్సెలింగ్ తేదీలు ఖరారు చేసే పనిలో ఆయా శాఖల అధికారులు నిమగ్నమయ్యారు. ఉమ్మడి జిల్లాలో 867 రైతు సేవా కేంద్రాలున్నాయి. అనంతపురం జిల్లాలో 126 మంది, శ్రీ సత్యసాయి జిల్లాలో 124 మంది విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. వీరిలో ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారు ‘అనంత’లో 101 మంది, ‘శ్రీ సత్యసాయి’లో 102 మంది ఉన్నారు. హార్టికల్చర్ అసిస్టెంట్లు ‘అనంత’లో 180 మంది, ‘శ్రీ సత్యసాయి’లో 143 మంది ఉండగా అందరికీ ఐదేళ్లు పూర్తయ్యాయి. ఇక.. ఐదేళ్లు పూర్తి చేసుకున్న సెరికల్చర్ అసిస్టెంట్లు ‘అనంత’లో 12 మంది, శ్రీ సత్యసాయిలో 73 మంది ఉన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పశు సంవర్ధక శాఖకు సంబంధించి 666 మంది వెటర్నరీ అసిస్టెంట్లు పనిచేస్తున్నారు.
సీఎం పర్యటనకు
స్థల పరిశీలన
పుట్టపర్తి టౌన్: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు జూలై 5వ తేదీన కొత్తచెరువుకు రానున్నట్లు జిల్లా అధికారులకు ప్రాథమిక సమాచారం అందింది. ఈ నేపథ్యంలో బుధవారం ఎస్పీ రత్న అధికారులతో కలిసి కొత్తచెరువులో పర్యటించారు. ‘తల్లికి వందనం’ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖమంత్రి నారా లోకేష్ జూలై 5వ తేదీన కొత్తచెరువుకు రానున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతో ముఖాముఖి సమావేశంతో పాటు బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. దీంతో బహిరంగ సభ కోసం కొత్తచెరువు జూనియర్ కళాశాల మైదానాన్ని ఎస్పీ రత్న పరిశీలించారు. మైదానాన్ని త్వరితగతిన చదును చేయాలని అధికారులను ఆదేశించారు. ఎస్పీ వెంట డీఎస్పీ విజయకుమార్, సీఐలు బాలసుబ్రహ్మణ్యంరెడ్డి, నరేష్ మారుతీ శంకర్, తహసీల్దార్ బాలాంజనేయులు, ఎంఈఓ జయచంద్ర ఉన్నారు.

మా వాహనాలకు క్లియరెన్స్ ఇప్పించండి