
అనుకున్నట్టే కానిచ్చేశారు!
● 2008, 1998 ఎంటీఎస్ టీచర్లకు
వేర్వేరుగా బదిలీల కౌన్సెలింగ్
● 2008 టీచర్లకు కౌన్సెలింగ్ పూర్తి
అనంతపురం ఎడ్యుకేషన్: ఇప్పటికే రెండుమార్లు వాయిదా పడ్డ ఎంటీఎస్ టీచర్ల బదిలీల అంశంలో అధికారులు కొత్త పంథా ఎంచుకుని అనుకున్నట్టే చేశారు. సీనియార్టీ జాబితాలో 2008 ఎంటీఎస్ టీచర్లు ముందున్నారు. వీరి తర్వాతనే 1998 ఎంటీఎస్ టీచర్లు మొదలవుతారు. ఖాళీలన్నీ దూర ప్రాంతాల్లో ఉండడం.. ఉన్న వాటిలో 2008 ఎంటీఎస్ టీచర్లకు కాస్తా మంచివి దక్కుతాయి. రెండుసార్లు వాయిదా పడడంలో 1998 ఎంటీఎస్ టీచర్ల పాత్ర ఎక్కువగా ఉందని నిర్ణయానికి వచ్చిన విద్యాశాఖ... ఎంటీఎస్ టీచర్ల మధ్య ‘విభజించు–పాలించు’ సూత్రాన్ని అమలు చేసింది. 2008, 1998 వారికి వేర్వేరుగా కౌన్సెలింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో డీఈఓ పేరుతో మెసేజ్ పంపారు. ‘2008 ఎంటీఎస్ టీచర్లకు మాత్రమే సాయంత్రం 5 గంటలకు కౌన్సెలింగ్’ ఉంటుందని పేర్కొన్నారు.
గొడవతో ఉద్రిక్తత..
సాయంత్రం 5 గంటలకు వచ్చిన 2008 ఎంటీఎస్ టీచర్లు..జాబితాలోని 50 మందికి మాత్రమే మంచి స్కూళ్లు వస్తాయని, తక్కిన 147 మంది దూర ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుందని వాపోయారు. ఇలా రెండు గ్రూపులు విడిపోయి వాదించుకున్నారు. ఇక ‘కౌన్సెలింగ్‌కు హాజరుకాకపోతే కమిషనరేట్ నుంచి ఉత్తర్వులు జనరేట్ అవుతాయి.. ఎవరికి ఎక్కడొస్తాయో మీ ఇష్టం’ అంటూ విద్యాశాఖ సిబ్బంది బెదిరింపులకు దిగడంతో ఎంటీఎస్ టీచర్లు ఇరకాటంలో పడ్డారు. జాబితాలో ముందున్న వారు తాము కౌన్సెలింగ్‌లో పాల్గొంటామని చెప్పడంతో మరికొందరు అడ్డుకున్నారు. దీంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ఎట్టకేలకు రాత్రి 7 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ సజావుగా ముగిసింది. ఇక.. నేడో, రేపో 1998 ఎంటీఎస్ టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు.