
జీతాలు ఇప్పించండి మహాప్రభో
● విద్యుత్ మీటర్ రీడర్ల వేడుకోలు
పుట్టపర్తి టౌన్: మూడు నెలల వేతన బకాయిలు చెల్లించాలంటూ విద్యుత్ శాఖ ఎస్‌ఈ సంపత్‌కుమార్‌ను ఆ శాఖ మీటర్ రీడర్లు వేడుకున్నారు. ఈ మేరకు బుధవారం పుట్టపర్తిలోని ఎస్‌ఈ కార్యాలయంలో ఎస్‌ఈ సంపత్‌కుమార్‌ను కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 20 ఏళ్లుగా మీటర్ రీడర్లుగా తాము పనిచేస్తున్నామని వివరించారు. మూడు నెలలుగా జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో కుటుంబపోషణ భారమైందన్నారు. కలెక్టర్ దృష్టికి పలుమార్లు తీసుకుపోయినా న్యాయం జరగలేదని వాపోయారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు ఎస్కో అకౌంట్ ఓపెన్ చేసి జీతాలు చెల్లించేలా చొరవ తీసుకోవాలని కోరారు. డిమాండ్ సాధనలో భాగంగా జూలై 1న కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టనున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కిరణ్‌కుమార్, రవి, వినోద్, నరేష్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.