
మద్యం రాసిన మరణ శాసనం
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మద్యం విక్రయాలను ఆదాయ వనరుగా సీఎం చంద్రబాబు మార్చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మద్యం షాపుల నిర్వహణను దక్కించుకున్న ‘పచ్ఛ’ నేతలు నిబంధనలు తుంగలో తొక్కి వేళాపాళా లేకుండా విక్రయాలు చేపడుతున్నారు. దీంతో యువత మత్తులో జోగుతోంది. తాగుడు మానేయమని ఇంట్లో వారు ఒత్తిడి చేస్తే మందుబాబులు ఆత్మహత్యలకు వెనుకాడడం లేదు. ఇలాంటి ఘటనలు తరచూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వెలుగు చూస్తున్నాయి. గత వైఎస్సార్‌సీపీ హయాంలో ఈ పరిస్థితి లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ మద్యం విక్రయాలు సాగిస్తుండడంతో తమ పిల్లలు మత్తుకు బానిసలవుతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది మద్యం రాసిన మరణ శాసనం. ఈ శాసనానికి బుధవారం ఇద్దరు యువకులు బలయ్యారు.
● ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా
సమయపాలనలేని మద్యం విక్రయాలు
● మద్యానికి బానిసవుతున్న యువత
● తాగుడు మానేయమంటే ఆత్మహత్యలే
ధర్మవరం అర్బన్: మద్యం తాగొద్దని భార్య చెప్పినందుకు మనస్తాపంతో ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన బుధవారం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలోని మార్కెట్‌వీధిలో జరిగింది. వన్‌టౌన్ పోలీసులు తెలిపిన మేరకు... మార్కెట్‌వీధికి చెందిన డ్రైవర్ రాజేంద్రప్రసాద్(30)కు భార్య చంద్రకళ, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోజూ మద్యం తాగి ఇంటికి వస్తుండేవాడు. తాగుడు మానేయాలని భార్య బతిమాలినా వినేవాడు కాదు. మద్యం మానేయమంటే తాను చనిపోతానంటూ తరచూ బెదిరించేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఇంట్లో ఉన్న రూ.200 నగదు తీసుకుని మద్యం తాగి రాత్రి ఇంటికి తిరిగొచ్చాడు. ఈ విషయంపై భార్య ప్రశ్నించడంతో ఏదో ఒకటి చేసుకుని చనిపోతానంటూ బెదిరించి.. తన ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి హాల్లో నిద్రించాడు. రోజూ బెదిరించేది మామూలే కదా అనుకుని ఆమె కూడా పిల్లల పక్కన పడుకుని నిద్రపోయింది. బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో భార్యకు మెలకువ వచ్చి చూడగా హాల్లో నిద్రపోతున్న భర్త కనిపించలేదు. వంట గదిలోకి వెళ్లి చూడగా ఫ్యాన్ హుక్కుకు బెడ్‌షీట్‌తో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దృశ్యం కనిపించింది. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
● గుమ్మఘట్ట: తాగుడు మానేయమన్నందుకు ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం పైదొడ్డి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన రాజన్న, లక్ష్మక్క దంపతులకు నలుగురు కుమారులు కాగా, వ్యవసాయంతో కుటుంబాన్ని పోషించుకునేవారు. కుమారుల్లో చివరి వాడైన శశికుమార్ (28)కు పెళ్లి కాలేదు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. తాగుడు మానేయాలని కుటుంబసభ్యులు ఎంత చెప్పినా వినేవాడు కాదు. ఈ నేపథ్యంలో మంగళవారం మద్యం మత్తులో ఇంటికి చేరుకున్న కుమారుడికి తల్లిదండ్రులు మరోసారి నచ్చచెప్పారు. తాగుడు మానేస్తే ఎవరైనా పిల్లనిచ్చేందుకు ముందుకు వస్తారని ఇప్పటికై నా మద్యం సేవించడం మానేయాలని హితవు పలికారు. దీంతో మనస్తాపం చెందిన శశికుమార్ బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లగానే ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మధ్యాహ్నం ఇంటికి చేరుకున్న కుటుంబసభ్యులు విషయాన్ని గుర్తించి బోరున విలపించారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మద్యం రాసిన మరణ శాసనం

మద్యం రాసిన మరణ శాసనం