
పని సర్దుబాటులో టీచర్లను కేటాయించండి
పుట్టపర్తి అర్బన్: పని సర్దుబాటులో భాగంగా జిల్లా వ్యాప్తంగా అవసరమున్న పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలని ఎస్టీయూ డిమాండ్ చేసింది. ఈ మేరకు డీఈఓ కిష్టప్పకు ఆ సంఘం జిల్లా అద్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాదరెడ్డి, చంద్రశేఖర్ బుధవారం వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. పాఠశాలల పునర్విభజన ప్రక్రియలో భాగంగా ఉపాధ్యాయుల సాధారణ బదిలీల అనంతరం ఏకోపాధ్యాయ పాఠశాలలు, పిల్లల సంఖ్య పెరిగిన పాఠశాలలు, మున్సిపల్ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత నెలకొందన్నారు. పని సర్దుబాటులో భాగంగా ఆయా పాఠశాలలకు ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. అప్‌గ్రేడ్ అయిన పాఠశాలలకు హెచ్‌ఎం, పీఎస్ హెచ్‌ఎం, ఆదర్శ పాఠశాలల్లో కొత్తగా క్రియేట్ అయిన పోస్టులకు వెంటనే ఐడీలను క్రియేట్ చేసి సకాలంలో జీతాలు చెల్లించాలన్నారు. స్పాట్ వాల్యుయేషన్ బకాయిలను వెంటనే చెల్లించాలని, ఉపాధ్యాయులకు సాల్ట్, ఎఫ్‌ఎల్‌ఎన్ శిక్షణా తరగతులను సెలవు రోజుల్లో నిర్వహించాలని సూచించారు. ఎంటీఎస్ ఉపాధ్యాయులను వారి నివాసాలకు దగ్గరి మండలాల్లో నియమించాలన్నారు. కార్యక్రమంలో ఎస్జీయూ జిల్లా ఆర్థిక కార్యదర్శి గోపాల్‌నాయక్, రాష్ట్ర కమిటీ మాజీ సభ్యుడు ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి సంపత్‌కుమార్, రవిచంద్ర, మండల అధ్యక్షుడు శివయ్య, కౌన్సిల్ మెంబర్ అనిల్‌కుమార్, హెచ్‌ఎం చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సర్వేయర్ల సమస్యలు పరిష్కరించండి
● జేసీకి వినతిపత్రం అందజేసిన సర్వేయర్ల అసోసియేషన్ నాయకులు
ప్రశాంతి నిలయం: గ్రామ సర్వేయర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ ఆఫ్ ఏపీ సభ్యులు కార్తీక్, సురేష్, మనోహర్, హరి, బాలాజీ, భాస్కరరెడ్డి మండిపడ్డారు. ఐదేళ్లు సర్వీస్ పూర్తి చేసుకున్నా నేటికీ తమ సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదని ధ్వజమెత్తారు. గ్రామ సర్వేయర్ల సమస్యలు పరిష్కరించాలంటూ జాయింట్ కలెక్టర్ అభిషేక్‌కుమార్‌కు బుధవారం వారు వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. రేషనలైజేషన్, ట్రాన్స్‌ఫర్స్ ప్రక్రియలో ప్రభుత్వ అసంబద్ధ నిర్ణయాలతో తీరని అన్యాయం జరుగుతోందని వాపోయారు. భూ సర్వే సమయంలో జనాభా ప్రాతిపదికన కాకుండా భూ విస్తీర్ణం పరంగా హేతుబద్దీకరణ చేయాలన్నారు. రేషనలైజేషన్‌ను వెంటనే పూర్తి చేసి బదిలీలు చేపట్టాని డిమాండ్ చేశారు. సర్వే విభాగం ఉద్యోగులను టెక్నికల్ ఉద్యోగులుగా గుర్తిస్తూ సొంత మండలాలు కేటాయించాలన్నారు. రీ సర్వే సమయంలో బకాయి పడిన టీఏ, డీఏ బిల్లులు వెంటనే చెల్లించాలని కోరారు.