అనంతపురం అర్బన్: ఏడాది పాలనలో కూటమి ప్రభుత్వం ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుందని సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎంపీ పి.మధు అన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో బుధవారం అనంతపురం రైల్వేస్టేషన్ నుంచి క్లాక్ టవర్ సమీపంలోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నగర కార్యదర్శి రామిరెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో మధుతో పాటు సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు వి.రాంభూపాల్, జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప మాట్లాడారు. నాటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట స్ఫూర్తితో నేడు మతోన్మాద వ్యతిరేక పోరాటానికి సిద్ధం కావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రిన దేశంలో ఎమర్జెన్సీని అప్పటి కేంద్ర ప్రభుత్వం విధించి 1.13 లక్షల మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేయించిందని గుర్తు చేశారు. యాభై ఏళ్ల అనంతరం ఎమర్జెన్సీ చీకటి పాలనను గుర్తు చేసుకుంటే నేడు అంతకంటే ఎక్కువ ప్రమాదకర పరిస్థితి ఉందన్నారు. కార్పొరేట్, మతోన్మాద పాలకుల చేతిలో ప్రజలు నిర్బంధాన్ని చూడాల్సి వస్తోందన్నారు. రాష్ట్రంలో పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. మోదీ ప్రభుత్వానికి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయిందన్నారు. డీసీఎం పవన్‌కల్యాణ్ ద్వారా రాష్ట్రంలో మత రాజకీయాలను బీజేపీ ప్రోత్సహిస్తోందని విమర్శించారు. నిర్బంధ, మతోన్మాద దుష్ట పాలనపై ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం స్ఫూర్తితో ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. ఐక్య ఉద్యమాల ద్వారానే పేదల సమస్యలకు పరిష్కారం దక్కుతుందన్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు జి.ఓబుళు, రామరాజు, రాష్ట్ర కమిటీ సభ్యులు సావిత్రి, జిల్లా నాయకులు బాలరంగయ్య, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.
నాటి ఎమర్జెన్సీ చీకటి పాలనను
తలదన్నేలా నేడు రాష్ట్రంలో పరిస్థితులు
మతోన్మాద, నిర్బంధ పాలనపై
ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాట స్ఫూర్తితో ఉద్యమిద్దాం
సీపీఎం రాష్ట్ర నాయకుడు,
మాజీ ఎంపీ పి.మధు