
‘అనంత’లో వరుస హత్యల కలకలం
అనంతపురం: ఒక్క రోజు వ్యవధిలోనే రెండు హత్యలు చోటు చేసుకోవడంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మంగళవారం ఉదయం అనంతపురం నగరంలోని బళ్లారి బైపాస్ రోడ్డులో ఉన్న అన్న క్యాంటీన్ పరిసరాల్లో గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన రామలింగ కుమారుడు జి.సిదానంద (28) హత్యకు గురయ్యాడు. ఈ ఘటన మరువక ముందే మంగళవారం రాత్రి కుమ్మర నరసాపురం సురేష్ బాబు(43) దారుణంగా హతమయ్యాడు.
శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జిల్లాలో శాంతి భద్రతలు లోపించాయనేందుకు నిదర్శనంగా ఇప్పటికే పలు హత్యలు చోటు చేసుకున్నాయి. కేవలం 30 రోజులు కూడా గడవక ముందే మూడు హత్యలు చోటు చేసుకుని పోలీసుల వైఫల్యాన్ని ఎత్తి చూపాయి. నగరంలోని రామకృష్ణ కాలనీకి చెందిన గిరిజన యువతి తన్మయి (19)ని అతి కిరాతకంగా హత్య చేశారు. రాష్ట్రంలోనే ఈ ఘటన కలవరపాటుకు గురిచేసింది. ఈ ఘటన మరువక ముందే అనంతపురం నగరంలో ఒక్క రోజు వ్యవధిలోనే మరో రెండు హత్యలు జరిగాయి.
పోలీసులకే సవాల్ విసిరిన గంజాయి బ్యాచ్
అనంతపురం నగరంలో గంజాయి బ్యాచ్ హల్‌చల్ చేస్తోంది. ఏకంగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ముందే ‘దమ్ముంటే పట్టుకోరా షెకావత్’ అంటూ గంజాయి బ్యాచ్ వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేయడం ద్వారా పోలీసులకు సవాలు విసిరింది. కొన్ని రోజులుగా పుష్ప పాటతో రీల్ చేస్తూ సోషల్ మీడియాలో టాటూ చరణ్ అనే యువకుడు వైరల్ చేశాడు. ఈ నెల 18న అనంతపురంలోని సున్నపుగేరిలో నివాసముంటున్న యశోద ఇంట్లో టాటూ చరణ్, పవన్ చొరబడి డబ్బు కోసం బెదిరించి.. దాడి చేసి దౌర్జన్యంగా సెల్‌ఫోన్ లాక్కెళ్లారు. ఈ క్రమంలో ఈ నెల 21న టాటూ చరణ్, ఇతని అనుచరుడు పవన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఇది వరకే దొంగతనం, మనుషులపై దాడి కేసులో నిందితులు.